వనపర్తి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయితే, జిల్లాలో వివిధ కారణాలతో అర్హులైన రైతులకు ప్రారంభంలో రుణమాఫీ కాలేదు. అర్హత ఉండి మాఫీకాని రైతులు పలుచోట్ల ఆందోళనలు చేయడంతో స్పందించిన ప్రభుత్వం రైతు కుటుంబాల నిర్ధారణకు వ్యవసాయశాఖ ద్వారా శ్రీకారం చుట్టి లోపాల సవరణకు కార్యచరణ తీసుకున్నది. ఇందులో భాగంగా ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 4 వరకు గ్రామస్థాయిలో సభలు నిర్వహణ, అనంతరం వ్యవసాయ కార్యాలయాలు, రైతు వేదికల్లో నిర్ధారణ ప్రక్రియలను చేపట్టింది. ఇప్పుడప్పుడంటూ 4వ విడుత రుణమాఫీ అని ఇటీవల నాలుగు రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ సభలో ప్రకటించి వెళ్లినా రైతుల ఖాతాలో డబ్బులు జమకాని పరిస్థితి ఉంది. వెరిసి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిర్ధారణలో సగం మంది రైతులకు కూడా నాలుగో విడుతలో రుణమాఫీ రాకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తున్నది.
4వ విడుతలో రూ.48 కోట్లు..
జిల్లా పరిధిలోని 14 మండలాల్లో 4వ విడుత లో దాదాపు రూ.48 కోట్ల 79 లక్షలు విడుదల చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి 5,366మంది రైతులకు రుణమాఫీ కింద ఈ డబ్బులు జమ చేయనున్నారు. అయితే.. గతంలో వ్యవసాయ శాఖ ద్వారా సేకరించిన వాటిలో సగం మందికి కూడా మాఫీ కాలేదని తెలుస్తున్నది. ఇంకా చాలా మంది రైతులు రూ. 2లక్షల లోపు రుణం ఉన్న వారు వివిధ కారణాలతో మిగిలి పోయినట్లుగా చెబుతున్నారు. ఇక రుణమాఫీ నూటికి నూరుశాతం క్లియర్ అంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటనలు చేసిన క్రమంలో మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉం టే.. జిల్లాలో తొలివిడుతలో 27వేల 66మందికి రూ. 145.55 కోట్లు, రెండో విడుతలో 16,527మందికి రూ.154.58 కోట్లు, మూడో విడుతలో రూ. 10,47 మందికి రూ.126.62 కోట్లు మాఫీ కింద వచ్చింది. ఇలా మొత్తం జిల్లాలో 53,640 మంది రైతులకు రూ.426.76 కోట్లు రుణమాఫీ అయ్యింది.
10 వేల రైతులకు అందని మాఫీ..
జిల్లాలో ఇంకా దాదాపు 10 వేల మంది అర్హులైన రైతులకు రుణమాఫీ అందలేదని అంచనా. గతంలో వ్యవసాయశాఖలో నిర్ధారణ ప్రక్రియ చేసుకున్న వాటిలో నూ సగం మందికి నాలుగో విడుత మాఫీలో లిస్టులో పేర్లు రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నా రు. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించినా అమలు కాలేదు. జిల్లాలో వ్యవసాయశాఖ ద్వారానే 9,127 మంది రైతులకు సమస్య ఉన్నట్లుగా గతంలో గుర్తించారు. కనీసం వారికి కూడా 4 విడుతలో మాఫీ కాలేదు. అయితే రూ.రెండు లక్షలకు పైబడి రుణం ఉన్న వారి సంఖ్య జిల్లాలో మరింత భారీగానే ఉండే పరిస్థితి ఉంది. వారందరికీ రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగులుతుందని భావిస్తున్నారు.
బ్యాంకులకు చేరని డబ్బులు..
నాలుగో విడుత రుణమాఫీ ప్రకటించి నాలుగు రోజులు గడిచినప్పటికీ ఇంకా అనేక బ్యాంకుల్లో నిధు లు జమ కాలేదు. అన్ని బ్యాంకులకు మాఫీ రైతుల లిస్టులు చేరుకున్నప్పటికీ డబ్బుల జమమాత్రం కాలే దు. వీటిలో కొన్ని బ్యాంకులకు మాత్రం కొన్ని అకౌంట్లకు మాత్రమే డబ్బులు జమ అయినట్లు తెలుస్తుంది. మరికొన్ని బ్యాంకుల్లో ఒక్క అకౌంట్కు కూడా డబ్బు లు జమ కానీ పరిస్థితి ఉంది. రైతులు మాత్రం వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నాలుగో విడుత మాఫీపై ఏ కార్యాలయానికి వెళ్లినా సరైన సమాధానం రావడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
స్పందించని డీఏవో..
4వ విడుత రుణమాఫీకి సంబంధించి ప్రాథమిక సమాచారం కోసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్నాయక్ను సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందించ లేదు. మంగళవారం కార్యాయానికి వెళితే అక్కడ అందుబాటులో లేరు. ఫోన్లో తెలుసుకొనే ప్రయత్నం చేసినా రెస్పాండ్ అవ్వలేదు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఫోన్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. జిల్లా అధికారులే ఇలా ఫోన్లకు కనీస రెస్పాన్స్ ఇవ్వని క్రమంలో కింది స్థాయి అధికారులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకుండానే అర్థమవుతుంది.
రుణమాఫీ లిస్టులో నా పేరు లేదు..
వ్యవసాయ అధికారులు అన్ని రాసుకున్నా రు. ఫొటోలు తీసుకున్నారు. అయినా నాలుగో విడుత మాఫీ లిస్టులో మాపేరు లే దు. ఒక కుటుంబానికి రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు. నా పేరుతో రూ.లక్షా 50వేల రుణం ఉంది. నాకు ఎందుకు మాఫీ కాలేదు. అధికారులను అడిగినా లిస్టులో పేరు లేదని చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగా ఉంది.
– వెంకటేశ్, రైతు, శ్రీకృష్ణనగర్, అమరచింత
కొర్రీలు పెట్టి లేదంటుండ్రు..
బ్యాంకులో అడిగితే నాలుగో విడుత రుణమాఫీ లిస్టులో నా పేరు రాలేందంటున్నారు. నాకు రూ. లక్షా 50 వేల అప్పు యూనియన్ బ్యాంకులో ఉంది. మా అమ్మకు నాకు ఒకే రేషన్ కార్డు ఉంది. ఒకే రేషన్ కార్డు ఉన్నవారికి మాఫీ కాదా.. కావాలనే ఇలా లింకు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంటికి రూ.రెండు లక్షలు చేస్తామన్నారు. అలాగే చేయండి. కానీ.. మాలాంటి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. మాఫీ వస్తదంటే ఎంతో ఆశపడ్డం. మా అశలు ఆవిరి అవుతున్నయి.
-ఎం శ్రీనివాసులు, రైతు, పామిరెడ్డిపల్లి, అమరచింత మండలం
రాగానే జమ చేస్తాం..
నాలుగో విడుత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అయిన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఇప్పటి వరకు రాలేదు. బ్యాంకు వారీగా 4వేల 29 మందికి రూ.4కోట్ల 85 లక్షలు మాఫీ అయినట్లు లిస్టు వచ్చింది. కానీ ప్రభుత్వం నుంచి బ్యాంకులో జమ కాలేదు. త్వరలో వచ్చే అవకాశముంది. రైతులు డబ్బులు పడే వరకు ఆగాలి.
– శివశంకర్, బ్రాంచ్ మేనేజర్, యూనియన్ బ్యాంక్, అమరచింత