మహబూబ్ నగర్ : ఆశా వర్కర్ల ( Asha Workers ) సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆశావర్కర్లు జడ్చర్ల ( Jadcherla ) సమీపంలోని కావరమ్మపేట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది మహిళలు రోడ్డుపై బైఠాయించారు.
ధర్నా వల్ల హైదరాబాద్ – కర్నూలు జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి . జీతాలు ఇవ్వాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆశా వర్కర్లు నినాదాలు చేశారు. జీతాలు లేక కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించడం లేదని, వెట్టి చాకిరీ చేయించుకుంటూ వేతనాలు నిలిపివేయడం దారుణమని అన్నారు. ధర్నాను విరమించాలని పోలీసులు బలగాలు కోరగా ససేమిరా అనడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆశావర్కర్లను అక్కడి నుంచి తొలగించేందుకు నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. అధికారులు రాతపూర్వక హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.