గద్వాల అర్బన్, జూన్ 8 : ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలోని రైతులు సన్నరకం వడ్ల్లు అధిక మొత్తంలో సాగుచేయడంతో ఆ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి మర అడించి బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించుకున్నది. అదిశగా జిల్లాలో సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్ల గోదాంలకు పంపితే..ఇదే అదునుగా భావించిన మిల్లర్లు తమ చేతికి పని చెప్పారు. వాస్తవానికి తెలంగాణ సన్న వడ్ల రకానికి కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది.
సన్న వ డ్ల్లు క్వింటాకు రూ.2,800 నుంచి రూ. 3,100 ధర పలుతున్నది. దీంతో మిల్ల ర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే వడ్లను పరిశీలించి దొడ్డు రకం ఒక చోట.. సన్నరకం మ రొక చోట దింపుకొన్నారు. తీరా సన్నరకానికి మంచి రేటు రావడంతో మిల్లర్లు ఆ వడ్లను కర్ణాటక రాష్ర్టానికి బ్లాక్‌లో తరలించేందుకు పూనుకున్నారు. జిల్లాలో ఇప్పటికే రూ.20 కోట్ల విలువైన సన్న వడ్లను కర్ణాటక రాష్ర్టానికి తరలించినట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది. గోదాంలో ఉండాల్సి వడ్లు కొద్దికొద్దిగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతుండడంతో గోదాం ఖాళీగా కనబడు తున్నట్లు సమాచారం. కాగా గోదాంలో వడ్ల లెక్కలను పరిశీలించాల్సిన అధికారులు కూడా నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరించిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గుట్టు గా సన్న వడ్లు ఖాళీ అవుతున్నా వాటి లెక్కల ను ఎందుకు ఉన్నతాధికారుల దృష్టిలో ఉం చడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు మధ్య జరుగుతున్న చర్చ జిల్లా బాస్‌కు తెలియడంతో రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు సెంటర్ల నుంచి ఎంత ధాన్యం వచ్చింది..ఏ సెంటర్ నుంచి ఏ రైస్ మిల్లుకు ఎంత ధాన్యం తరలించారో.. అన్ని లెక్కలను తీసుకొని రైస్ మిల్లులతోపాటు గోదాంలలో లెక్కలను పరిశీలించాల్సిందిగా కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా మిల్లులో అధికారులు తనిఖీ చేస్తున్న క్రమం లో పొంతన లేని లెక్కలు వస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్ని మిల్లులో సన్నరకం వడ్లు పూర్తి స్థాయిలో ఖాళీ అయినట్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ లెక్కలను ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచినట్లు సమాచారం.
రైతుల నుంచి ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసి వాటిని మిల్లర్లకు అందజేసి వారి నుంచి బియ్యం తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన వడ్లను ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. మిల్లులపై నిత్యం పర్యవేక్షిస్తాం. ఎవరైనా మిల్లర్లు బ్లాక్ మార్కెట్‌కు వడ్లు తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
-అదనపు కలెక్టర్ మధుమోహన్