ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాడు ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల్లో నేడు పూజలు, పునస్కారాలతో సందడి నెలకొన్నది. తెలంగాణలో గుళ్లు, గోపురాలకు పూర్వవైభవం సంతరించుకున్నది. సీఎం కేసీఆర్ హయాంలో ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. మన్యంకొండ ఆలయం వద్ద రోప్‌వే నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. అక్కడే రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్, కల్యాణ మండపం నిర్మిస్తున్నారు. రూ.కోట్లతో కురుమూర్తి ఆలయం, రూ.15 కోట్లతో సింగోటం, రూ.10 కోట్లతో శ్రీరామకొండ క్షేత్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంకా పలు ఆలయాల కోసం నిధులు కేటాయించారు. చర్చిలు, మసీదులకూ విరివిగా బడ్జెట్ కేటాయిస్తున్నారు.
మహబూబ్‌నగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఎన్నో ఆలయాలు నేడు కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ గుళ్లు, గోపురాలు, మసీదులు, చర్చీలకు వందల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రఖ్యాత ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. భక్తులు ఇచ్చే విరాళాలతో దేవాదాయ శాఖ పరిధిలో విరాజిల్లుతున్న అనేక దేవాలయాలను రూ.కోట్లతో అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సర్కారు చొరవతో ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతున్నది.
మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తుండడంతో అన్ని వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగకు హిందువులకు చీరలు, రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేస్తూ అందరినీ అక్కున చేర్చుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆలయాలు, మసీదులు, చర్చీలకు తెలంగాణ వచ్చాక దశ తిరిగింది. కురుమూర్తి వేంకటేశ్వరస్వామి, పాలమూరు లక్ష్మీనర్సింహస్వామి, కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, కోయిలకొండ రామకొండ ఆలయాలతోపాటు ఉమ్మడి జిల్లాలోని చర్చీలు, మసీదులకు రూ.లక్షల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం చేపట్టనున్న ఆధ్యాత్మిక శోభ కార్యక్రమాలకు గుళ్లు, గోపురాలను ముస్తాబు చేశారు.
మన్యంకొండకు మహర్దశ
తీరితే తిరుమల.. తీరకపోతే మన్యంకొండ అనేది సామేత. పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండ ఆలయానికి తెలంగాణ వచ్చాక మహర్దశ చేకూరింది. దేవస్థానం అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సుమారు రూ.వందకోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలోనే తొలిసారిగా రోప్‌వేను రూ.50కోట్లతో నిర్మిస్తున్నారు. మన్యంకొండ గేటు నుంచి కొండ వరకు నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండ మీద వసతి గృహలు నిర్మించగా.. తాజాగా కొండ కింద రూ.15కోట్లతో హరిత హోటల్, ఆధునిక హంగులతో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మరో రూ.50కోట్లతో కొండపైన పార్కులు, కల్యాణ మండపాలు, భక్తులు ఉండేందుకు బడ్జెట్ హోటల్, రోప్‌వే సౌలత్ కల్పిస్తున్నారు. కొండ కింద ఆలయానికి సంబంధించిన భూమిలో పార్కు, గోవింద నామాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్వామివారి కోనేరును శుద్ధిచేసిన జలాలతో నింపగా.. రూపురేఖలు పూర్తిగా మారిపోయేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాలమూరు పట్టణంలోని సింహగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని కూడా రూ.10కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని అబ్దుల్‌ఖాదర్ దర్గా, రూ.కోటితో క్రిస్టియన్ భవన్, రూ.50లక్షలతో హజ్హౌస్లతోపాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు.
సింగోటం గుడికి రూ.15కోట్లు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింగపట్నం లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి రూ.15కోట్ల నిధులు తీసుకురాగా ఆలయ పునర్మిర్మాణ పనులతోపాటు భక్తులకు వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బిజినేపల్లి మండలం గంగారం సీతారామస్వామి ఆలయానికి రూ.50లక్షలు, మమ్మాయిపల్లి మార్కండేయస్వామి దేవాలయానికి రూ.50లక్షలు, పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలోని కల్యాణ మండపం ఆధునీకరణకు రూ.20లక్షలు, వట్టెం లక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి రూ.50లక్షలు, మిగిలిన ఆలయాలకు కామన్‌గుడ్ ఫండ్ కింద నిధులు విడుదల చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా రామకొండ ఆలయ పునః నిర్మాణం, అభివృద్ధికి పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రూ.15కోట్లు మంజూరు చేయించగా.. పనులు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక క్షేత్రం కురుమూర్తి దేవస్థానంలోనూ భక్తుల సౌకర్యార్థం రూ.కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆలయానికి ఇదివరకే రాజగోపురాన్ని నిర్మింపజేసి భక్తులు ఎక్కి, దిగేందుకు మెట్ల సౌకర్యం కల్పించారు. తాజాగా రహదారి ఏర్పాటుకు నిధులు వెచ్చిస్తున్నారు. రూ.40కోట్లతో దేవాలయం సమీపంలోని వాగుపై హై లెవల్ వంతెన కం చెక్‌డ్యాంను నిర్మిస్తున్నారు. స్వామివారి పాదుకలు తీసుకొచ్చేందుకు వంతెన ఎంతో ఉపయోగపడనున్నది. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల నియెజకవర్గాల్లోని ఆలయాల అభివృద్ధికి కూడా నిధులు వెచ్చిస్తున్నారు.
మసీదులు, చర్చీలకు రూ.కోట్ల నిధులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మసీదులు, చర్చీల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నది. కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. క్రిస్టియన్, ముస్లింలలో పేదవర్గాల పెండ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం క్రిస్టియన్ భవన్లు, హజ్ భవన్లకు నిధులు విడుదల చేయగా ఆయా జిల్లాకేంద్రాల్లో పనులు జరుగుతున్నాయి. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తున్నది. వీరందరూ సమావేశం అయ్యేందుకు ఈ భవనాలు ఉపయోగపడనున్నాయి. గ్రామాల్లో చర్చీలు, ప్రార్థనా స్థలాలను కూడా అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఆధ్యాత్మిక శోభను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో అన్ని గుళ్లు, గోపురాలు, మసీదులు, చర్చీలు ముస్తాబు చేసి తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న మార్పులను గుర్తు చేసుకుంటున్నారు.
ఆలయాలకు నిధులు మంజూరు
నారాయణపేట మండలం ఏక్లాస్పూర్ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.60లక్షలు, కోయిలకొండ ఆది ఆంజనేయస్వామి ఆలయానికి రూ.50లక్షలు, కోయిలకొడ మండలం మోదీపూర్ ఆది ఆంజనేయస్వామి ఆలయానికి రూ.50లక్షలు, కోయిలకొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.10లక్షలు, ఎల్లారెడ్డిపల్లిలోని మురళీకృష్ణ, వీరాంజనేయ, ఆది ఆంజనేయస్వామి ఆలయాలకు రూ.కోటీయాభైలక్షలు, కోయిలకొండలోని రామకొండ ఆలయానికి రూ.10కోట్లు, ధన్వాడలోని కనకరాయ ఆలయానికి రూ.60లక్షలు, నారాయణపేటలోని అభయాంజనేయస్వామి ఆలయానికి రూ.48లక్షలు మంజూరయ్యాయి.