జడ్చర్ల టౌన్/బాలానగర్ (రాజాపూర్)/కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 7 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్‌లోని తన నివాసంలో రాజాపూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బుధవారం సాయంత్రానికి రిజర్వేషన్ల వ్యవహారం తెలిసిపోతుందని, అనంతరం అభ్యర్థులు ఎవరనేది నిర్ణయిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు మినహా మిగతా వాటికి మంగళం పాడారని తెలిపారు. ఏఏ అంశాల్లో కాంగ్రెస్ బాకీ ఉందో.. వాటికి సంబంధించిన బాకీ కార్డులను ప్రజలకు పంచుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు.
అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి పనులకే మార్పు పేరిట కాంగ్రెస్ బోర్డులు మార్చడం, పేర్లు మార్చడం తప్పా చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి ప్రభుత్వ వైఫల్యాలే దోహదపడుతాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీలోని ప్రతిఒక్కరూ సమన్వయంతో, కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేసినా విభేదాలు లేకుండా పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి, అభిమన్యురెడ్డి, శ్రీశైలంయాదవ్, మోహన్‌నాయక్, బచ్చిరెడ్డి, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.