ప్ర‘జల’ సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం పాలమూరు-రంగారెడ్డి స్వప్నం సాకారంకానున్నది. కర్షకులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ డిజైన్ చేసిన పథకం ప్రారంభానికి సిద్ధమైంది. శనివారం నార్లాపూర్ సమీపంలో లిఫ్ట్-1 వద్ద వెట్న్‌న్రు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లలో ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది మునిగిపోయారు. అబ్బురపరిచే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టును నిర్మించారు. 90 టీఎంసీల నీటి తరలింపే టార్గెట్‌గా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ వద్ద భారీ రిజర్వాయర్లను నిర్మించారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఏదుల వద్ద ఆసియాలోనే లార్జెస్ట్ సర్జ్‌పూల్, పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టారు. నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లకుమించి మహాబాహుబలి మోటర్లు సిద్ధమయ్యాయి. పరిశ్రమలకు ఈ నీరే అందనున్నది. దీంతో కోనసీమను తలదన్నేలా ఉమ్మడి జిల్లా దశ, దిశ మారనున్నది.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. కాళేశ్వరంలో వాడిన బాహుబలి పంపులను మించి ఇక్కడ మహా బాహుబలి పంపులను వాడుతున్నారు. దీంతో కాళేశ్వరం రికార్డును కూడా బద్దలు కొట్టేసింది. ఇక ఎక్కువ భాగం టన్నెళ్లు నిర్మించింది కూడా ఈ ప్రాజెక్టులోనే. ప్రాజెక్టు పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. తెలంగాణలో అతిభారీ ప్రాజెక్టుగా అవతరించింది. సాగు, తాగునీటికి ఉద్దేశించిన ఈ పథకం శ్రీశైలం వెనుక జలాల నుంచి 90టీఎంసీలను వాడుకునేలా డిజైన్ చేశారు.
అంజనగిరి (నార్లాపూర్), వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి (వట్టెం), కురుమూర్తి రాయ (కరివెన), ఉదండాపూర్ రిజర్వాయర్లు నిర్మించారు. ఒక్క ఉదంపూర్ రిజర్వాయర్ మాత్రమే పూర్తి కావాల్సి ఉన్నది. నార్లపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్ల వద్ద భూగర్భంలో టన్నెళ్లను నిర్మించి సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌లను నిర్మించారు. నాలుగు రిజర్వాయర్లలో రెండు రిజర్వాయర్ల వద్ద 400/11 కేవీ సబ్‌స్టేషన్ పనులు పూర్తి కాగా, వట్టెం, ఉదండాపూర్ వద్ద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్రోచ్ కెనాల్లో 80శాతం పనులు పూర్తి కాగా, టన్నెళ్లు వందశాతం పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 27,047 ఎకరాల భూమిని సేకరించారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గ్రామాలకు, తండాలకు పునరావాసం కల్పించే ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఈనెల 3న నార్లాపూర్ వద్ద డ్రైరన్‌ను సక్సెస్ పుల్గా చేపట్టారు. ఇలా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈనెల 16న ప్రారంభించనున్నారు. కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి మహా బాహుబలి మోటర్‌ను స్వీచ్ ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు.
అనంతరం భారీ బహిరంగ సభలో సీఏం మాట్లాడనున్నారు. దశాబ్దాలుగా కలలుగన్న పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం ఉమ్మడి జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తున్నది. సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశాక కృష్ణా జలాలను కలశాలతో తీసుకెళ్లి గ్రామాల్లోని ఆలయాల్లో అభిషేకం చేయనున్నారు. భారీ ఎత్తున జనసమీకరణ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అపూర్వఘట్టం మరో 24 గంటల్లో సాక్షాత్కరించరించబోతున్నది. అన్నదాతలు వెయ్యి కండ్లతో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. పాలమూరు జలసాకారం సిద్ధించబోతుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మారనున్న రూపురేఖలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి ఉద్దేశించి నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు రూపురేఖలు మారబోతున్నాయి. ఈభారీ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదికే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన గ్రామం వద్ద 2015 జూన్ 11న సీఎం శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన పడగానే విపక్షాలు, ఆంధ్రోళ్లు ఏకమై కేసులమీద కేసులు వేశారు. సాధ్యం కాని ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారని విమర్శలు గుప్పించారు. అవినీతి, ఆరోపణలు అంటగట్టినా సర్కార్ వెనక్కి తగ్గలేదు. దీనికి తోడు బీజేపీ 2014 ముందు ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలో వస్తే జాతీయ హోదా ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలో వచ్చాక మాట మార్చింది. తెలంగాణ సర్కార్ చేపట్టిన ఈప్రాజెక్టును కుట్రతో అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పాలు పంచుకున్నది.
కృష్ణానది జలాల్లో వాటా తేల్చకుండా తాత్సరం చేసింది. కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే.. తెలంగాణ ప్రభుత్వ వాదన వినకుండా పర్యావరణ అనుమతులు లేవని సుమారు రూ.500కోట్ల జరిమానా విధించింది. అనుమతులు ఇవ్వకుండా తొమ్మిదిన్నరేండ్లు కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ప్రజలు తిరగబడటం చూసి కేంద్రం దిగివచ్చి అనుమతులు ఇచ్చేసింది. జాతీయహోదా మాత్రం ఇవ్వకుండా చేతులు దులుపుకుంది. దీంతో అప్పటికే ప్రభుత్వం కొత్తతరహా ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. మొత్తం తొమ్మిది పంపుల్లో ఒక పంపును రెడీ చేశారు. ఈ పంపు ప్రతిరోజూ 0.25 టీఎంసీల నీటిని పంపింగ్ చేస్తుంది. నార్లాపూర్ రిజర్వాయర్‌లో 8 రోజుల్లో 2 టీఎంసీల నీటిని విడుదల చేశాక మరో ఎనిమిది రోజుల తర్వాత ఏదుల రిజర్వాయర్‌కు, అటు నుంచి మరో ఎనిమిది రోజులకు వట్టెం రిజర్వాయర్‌కు, 45 రోజుల తర్వాత కర్వెనకు నీటిని విడుదల చేస్తారు. ఒక్కో రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తూ వచ్చే యాసంగికి సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద కృష్ణానది జలాలను తోడుకుంటూ పంప్‌హౌస్ ద్వారా 104 మీటర్ల ఎగువకు ఉన్న రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. నది నుంచి 1.225 కిలోమీటర్ల వరకు అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీకి చేరుకుంటాయి. 0.025 కిలోమీటర్ల నుంచి నీళ్లు వదులుతారు. 0.150 కిలోమీటర్ల దూరం మూడు టన్నెళ్లలోకి ప్రవేశించి సర్జ్‌పూల్‌లోకి వస్తాయి. ఇక్కడ నిర్మించిన సర్జ్‌పూల్ అతిపెద్దది. 25 మీటర్ల వెడల్పు, 215 మీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇక్కడి నుంచి డ్రాప్ట్ ట్యూబ్ ద్వారా పంప్‌హౌస్‌లోకి నీళ్లు చేరుతాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులు రన్ అయ్యి 104 మీటర్ల ఎత్తులో ఉన్న ఇన్‌టేక్‌వెల్‌లోకి వెళ్తాయి. పంప్‌హౌస్‌లో మొత్తం 9 మోటర్లను బిగించారు. 8 మోటర్లు, ఒక స్టాండ్ బై మోటర్ ఉన్నది. మోటర్ల కోసం 400/11 కేవీ సబ్‌స్టేష్టన్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి ఏదులకు 16.005 కిలోమీటర్ల మేర ట్విన్ టన్నెళ్లను తవ్వారు. మరో 6.325 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా మొత్తం 24,330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదులకు చేరుతాయి.
ఏదుల గ్రామం వద్ద నిర్మించిన రిజర్వాయర్‌లోకి టన్నెళ్ల ద్వారా ప్రవేశించిన కృష్ణా జలాలు ఇక్కడ సర్జ్‌పూల్‌లోకి చేరుకుంటాయి. ఇక్కడ పంప్‌హౌస్‌లో 145 మెగావాట్ల 9 మోటర్లు బిగించారు. మరో మోటర్ స్టాండ్బైలో ఉంచా రు. ఇక్కడ పంప్‌హౌస్ నుంచి 104 మీటర్ల ఎత్తున్న ఏదుల రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేస్తారు. ఈ రిజర్వాయర్ రెండు పార్ట్‌లుగా ఉంటుంది. ఒక పార్ట్‌లో వచ్చిన నీటిని మధ్యలో కాల్వ ద్వారా మరో పార్ట్లోకి పంపిస్తారు. నీటిమట్టం పెరగగానే అటోమెటిక్‌గా దీంట్లో నీరు అక్కడికి చేరుకుంటాయి. ఏదులకు రావడానికి ముందు గేట్లతో హెడ్ రెగ్యులేటరీ నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని నియంత్రిస్తారు. ఇక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్‌కు 27.330 కిలోమీటర్ల దూరం నీటిని తరలిస్తారు. 6.400 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్, 20.930 కిలోమీటర్ల టన్నెళ్లను నిర్మించారు.
ఏదుల రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా టన్నెళ్లు, కాల్వలను దాటుకుంటూ వట్టెం సర్జ్పూల్కు నీళ్లు చేరుకుంటాయి. డ్రాప్ట్ ట్యూబ్ ద్వారా పంప్‌హౌస్‌లోకి చేరుకుంటాయి. ఇక్కడ పంప్‌హౌస్‌లో మొత్తం 145 మెగావాట్లతో తొమ్మిది పంప్‌లు బిగించారు. ఒక మోటర్ స్టాండ్బైలో ఉంటుంది. పంప్‌లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి 400/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. అక్కడి నుంచి డెలివరీ ఛానల్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేస్తారు. వట్టెం నుంచి 10.750 కిలోమీటర్ల దూరంలో ఉండే అప్రోచ్ కెనాల్ ద్వారా కరివెన రిజర్వాయర్‌లోకి నీటిని వదులుతారు. ఇక్కడి నుంచే లక్షా 33వేల ఎకరాలకు సాగునీరు వదులుతారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంలోనే అతిపెద్ద రిజర్వాయర్ కరివెన. ఇక్కడ ఏకంగా 19.15 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. వట్టెం నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేసి ఇక్కడ నుంచి ఉదండాపూర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ కట్ట కూడా పొడవుగా ఉంటుంది. ఒక వైపు కట్ట, మరోవైపు సహజ సిద్ధంగా ఉన్న గుట్టల మధ్య నీటిని నిల్వ చేస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి లక్షా 51వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. 10.855 కిలోమీటర్ల దూరంలోని ఉదండాపూర్‌కు నీటిని అందిస్తారు. ఇందులో 5.450 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్, 5.535 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉదండాపూర్‌కు కృష్ణాజలాలు పరుగులు పెడ్తాయి.
ఉదండాపూర్ రిజర్వాయర్ పాలమూరు-ఎత్తిపోతల పథకంలో కీలకమైంది. ఇక్కడి నుంచి మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తారు. రిజర్వాయర్ కింద 9లక్షల 36వేల ఎకరాలకు నీరందిస్తారు. అంతేకాకుండా తాగునీటికి, పరిశ్రమలకు కూడా ఇక్కడ నుంచే నీటిని వదలుతారు. ఇందుకు అనుగణంగా డిజైన్ చేశారు. భవిష్యత్‌లో ఈ రిజర్వాయర్ ద్వారా రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని అందించేందుకు ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా రిజర్వాయర్ల కింద కెనాల్స్ కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అన్ని అనుకూలిస్తే ఈ రిజర్వాయర్‌కు నవంబర్ వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది. వచ్చే వానకాలం నాటికి ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అన్నదాతలు ఈప్రాజెక్టుకోసం కోటి ఆశలతో ఎదురు చేస్తున్నారు.