మహబూబ్ నగర్ : పదవ తరగతి మూల్యాంకనం రేట్లు (SSC evaluation rates) పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ( Teachers Associations ) జేఏసీ శనివారం మహబూబ్‌నగర్‌లోని మూల్యాంకన కేంద్రం ఎదుట మెరుపు ధర్నా ( Dharna ) నిర్వహించారు. 8 ఏళ్లుగా రేట్లు పెంచకపోవడం వల్ల ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలను దిద్దడం కోసం ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఒక పరీక్ష పేపర్ కు కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే స్పాట్ వాల్యూయేషన్ రేట్లు పెంచాలని స్పాట్‌కు హాజరైన ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.
ఉపాధ్యాయులకు ప్రతి పేపర్ మూల్యాంకనానికి రూ. 10 నుంచి రూ. 25కు పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు రూ. 250 నుంచి రూ. 700 పెంచాలని కోరారు. టీఏ, డీఏలు ఇవ్వాలని, నాలుగవ తరగతి ఉద్యోగులకు రోజంతా పనిచేస్తే కేవలం రూ. 83 ఇవ్వడం దారుణమని, కనీసం రూ.500కు తగ్గకుండా ఇవ్వాలని, చీఫ్ ఎగ్జామినర్లకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
పేపర్లు దిద్దడానికి కుర్చీ, టేబుళ్లు ఏర్పాటు చేయాలని, చిన్నపిల్లలు కూర్చునే డెస్క్ లపై కూర్చుని వాల్యుయేషన్ చేయడం తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోయారు. ధర్నాలో యూటీఎఫ్ రవికుమార్, ఎన్ వెంకటేష్. టీపీఆర్టీయూ శ్యాంబాబు, ఎస్టీయూ వెంకటేష్, డీటీఎప్ రవీందర్ గౌడ్, టీపీటీఎఫ్ మహమూద్, టీటీయూ జుర్రు నారాయణ, ఎస్‌ఎల్‌టీఏ సురేంద్రనాథ్, ఆర్‌యూపీపీ శ్రీరాములు, టీఎస్టీయూ సతీష్, టీయూటీఎఫ్ గోపి శంకర్, టీఆర్టీఎఫ్ రామ్ రెడ్డి, మురళి, ఏపీయూటీఏ రఫీక్, బీటీఎఫ్ , టీజీయూఎస్ నాయకులతోపాటు మూల్యాంకన కేంద్రానికి హాజరైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగ అధికారి కమలాకర్ శర్మకు వినతి పత్రం సమర్పించారు.