కోస్గి, జూలై 15 : చదువులమ్మ ఒడి మృత్యు ఒడిగా మారకముందే తమను కాపాడాలని సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. కోస్గి మున్సిపల్ పరిధి సంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నది. వర్షం పడితే చాలు అక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు సైతం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చుంటున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతం మాత్రం కాదు.
సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఇక్కడ సుమారు 49మందికి పైగా విద్యార్థులు ఉండేవారని ఈ ఏడాది అది కాస్త తగ్గి ముప్పైకి చేరినట్టు గ్రామస్తులు వాపోతున్నారు. పాఠశాలకు విద్యార్థులను పంపాలంటే తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. పాఠశాలకు తమ పిల్లల్ని పంపడమంటే చావుకు సిద్ధపడడమే అని అంటున్నారు.
గత ఏడాది నూతన భవనం మంజూరైనా కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలతో అదికాస్తా పక్కదారి పట్టి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అవసరం లేని చోట్ల రోడ్లు వేసి రైతులను ఇబ్బంది పెట్టడం వదిలేసి విద్యార్థుల కోసం పాఠశాల భవనాలు నిర్మించి పేదలకు మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై పాఠశాల హెచ్ఎం నరేశ్‌ను వివరణ కోరగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, ఇదే విషయమై పై అధికారులకు విన్నవించామని తెలిపారు. విద్యార్థులు సైతం పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారని ఈ ఏడాది ఐదో తరగతి సైతం నడపడం లేదని తెలిపారు. దీంతో పాఠశాల భవనానికి ఆనుకొని రేకుల వేసి అందులోనే తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.