పాలమూరు సిగలో ‘తీగల’ మణిహారం వచ్చి చేరనున్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్రిడ్జిమెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గిరీశ్ భరద్వాజ్ వంతెన నిర్మాణానికి రూపకల్పన చేశారు. వంతెనను రూ.14కోట్లతో నిర్మిస్తుండగా.. ఇందుకు అవసరమైన సామగ్రిని దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేశారు.బ్రిడ్జి పొడవు 850 అడుగులు, ఎత్తు 90 అడుగులు, వెడల్పు 5 అడుగులుగా ఉన్నది. దీనిపై ఏక కాలంలో 200 మంది పర్యాటకులు వెళ్లినా తట్టుకునే సామర్థ్యం ఉండేలా నిర్మిస్తున్నారు. వారంలోగా బ్రిడ్జిని ప్రారంభించేందుకు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు మినీట్యాంక్‌బండ్ వద్ద ఐలాండ్, నెక్లెస్ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
– మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 5
మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 5 : పాలమూరు పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. మహానగరం హైదరాబాద్‌ను తలపించేలా కొంగొత్త అందాలతో ముస్తాబవుతోంది. ఇప్పటికే కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, మినీ శిల్పారామం, మినీ ట్యాంక్‌బండ్, విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు తదితర అభివృద్ధి పనులతో పట్టణాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంతో అభివృద్ధి చేశారు. ఇవే కాకుండా పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్ తర్వాత కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మంలో నిర్మించుకున్న సస్పెన్షన్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ అధునాతన వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.10కోట్ల వ్యయంతో చౌరస్తాల సుందరీకరణ పనులు పూర్తయ్యి కూడళ్లు సుందరంగా ముస్తాబయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్‌బండ్ వద్ద అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. సుమారు రూ.50కోట్ల వ్యయంతో పెద్దచెరువు మధ్యలో ఐలాండ్ పనులు చేపడుతున్నారు. ఐలాండ్‌లో హరిత హోటల్, పార్కు, నెక్లెస్‌రోడ్, వాకర్స్ట్రాక్ తదితర సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద మినీ శిల్పారామం నిర్మించి ప్రభుత్వ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఇప్పటికే ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునాతన ఎయిర్ సస్పెన్షన్ బ్రిడ్జిని పెద్ద చెరువు కట్టపై నిర్మించారు. గతేడాది పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేటలో ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేట్టారు. కరీంనగర్‌కు చెందిన శ్రీ కన్స్ట్రక్షన్ అనే సంస్థ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతోంది. తెలంగాణలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జీల నిర్మాణాలకు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్రిడ్జిమెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గిరీశ్ భరద్వాజ్ రూపకర్త. మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న వంతెనకు ప్రాజెక్టు డైరెక్టర్ పతాంజలి భరద్వాజ్ పర్యవేక్షణ చేపడుతున్నారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సాంకేతిక నిపుణులు ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 140కిపైగా సస్పెన్షన్ బ్రిడ్జీల నిర్మాణాలు చేపడుతోంది. సెలవులు, ప్రత్యేక రోజులు, పండుగ రోజుల్లో చిన్నా, పెద్దలు ఇక్కడికి వచ్చి సేదతీరేలా అందంగా దీన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ పట్టణాల సరసన మహబూబ్‌నగర్‌ను నిలిపేలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వంతెన నిర్మాణ వ్యయం రూ.14కోట్లు. నిర్మాణ సామగ్రిని దక్షిణ కొరియా నుంచి దిగిమతి చేశారు. రూ.3కోట్ల ైస్టెయిన్లెస్ స్టీల్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ వంతెన కింద 18 ఫిల్లర్లు నిర్మించారు. వంతెన ఊయల మాదిరిగా నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జికి నాలుగు స్తంభాలు నిర్మించారు. వంతెనపై ఎక్కితే మనిషికి ఉయ్యాల ఊగిన అనుభూతి కలుగుతుంది.
వంతెన పొడవు 850 అడుగులు (260 మీ.), ఎత్తు 90 అడుగులు (27.5 మీ.), వెడల్పు 5 అడుగులు (1.5మీ.)
ఈ వంతెనపై 150-200 మంది ఏకకాలంలో పర్యాటకులు ఎక్కి ఆహ్లాదం పొందవచ్చు.
గత ఏడాది మే నెలలో పనులు ప్రారంభించి ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తయ్యాయి.
ఈ నిర్మాణం పూర్తయ్యాక విద్యుత్తు కాంతుల మధ్య వంతెన అందంగా కన్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేకంగా పదుల సంఖ్యలో దీని వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తారు. పరిమితికి మించి ఇందులో జనాలు ఎక్కకుండా సెక్యూరిటీ సిబ్బంది నియంత్రించే వ్యవస్థ ఉంటుంది.