వనపర్తి టౌన్, మే 20 : తెలంగాణ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో సాహితీవేత్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి అని, ఆయన జయంతిని ఘనంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, సాహితీవేత్త, న్యాయవాది సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్రను ఆవిష్కరించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.
తన రచనలతో కేంద్ర సాహితీ అవార్డును పొందిన మహానీయుడని, సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావుడన్నారు. దళిత దండోరాను స్థాపించి అణగారిన వర్గాలకు అండగా నిలిచిన అపర మేధావి అని మాజీ మంత్రి కొనియాడారు. గోల్కొండ పత్రికను స్థాపించి జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని గుర్తుచేశారు. సురవరం జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సురవరం పేరు చిరస్థాయిగా ఉండాలని వారి పేరిట గ్రంథాలయం, సురవరం పార్కులో వారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
ఈ జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా వారి జీవితంపై పరిశోధనలు చేసిన గన్నమ రాజు, గిరిజా మనోహర్ బాబు, సాగునీటి రంగంలో పరిశోధనలు చేసిన శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులుగా చేస్తున్న సహాచర ఉద్యమకారుడు వి.ప్రకాశ్ పాల్గొంటారని సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజంపై పట్టింపు ఉన్న వ్యక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్, సాహితీవేత్తలు డాక్టర్ వీరయ్య, బలరాం, బైరోజు చంద్రశేఖర్, కిరణ్, తిరుమలేశ్, నరేశ్, బీఆర్ఎస్ నాయకులు జోహెబ్ హుస్సేన్, కుమార్, తోట శ్రీను తదితరులు ఉన్నారు.