గట్టు, జనవరి 30 : తమ పొలాన్ని సర్వే చేయకుండా అడ్డుకొంటున్నారని మనస్తాపం చెందిన తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన తల్లీకొడుకు ఉమామహేశ్వరికి 3 ఎకరాల 9 గుంటలు, ఆమె తల్లి మణెమ్మకు 3 ఎకరాల 35 గుంటల చొప్పున సమీపంలోని రాయపురం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 83/38, 83/ 39లో 7 ఎకరాల నాలుగు గుంటల గైరాన్ భూమి ఉన్నది. అయితే వారు గ్రామంలో కాకుండా ఇతర ప్రాంతంలో ఉంటున్నారు. దీంతో రాయపురం గ్రామానికి చెందిన రైతులు కొంత మేర కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పొలాన్ని సర్వే చేయాలని ఉమామహేశ్వరి, ఆమె కొడుకు రఘువంశీ రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సర్వేయర్, సిబ్బంది పొలం వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న సమీప పొలాల రైతులు అక్కడికి చేరుకొని సర్వేను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో మనస్తాపంతో చెందిన తల్లీకొడుకులు వారి వెంటన తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న వాళ్లు వారి ప్రయత్యాన్ని అడ్డుకొన్నారు.
అయినా వారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అక్కడున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పారు. తమ పొలాన్ని సర్వే చేయాలని అధికారులను కోరితే పక్క పొలాల రైతులు అడ్డుకొంటున్నారని వారు వాపోయారు. వారికి రాజకీయ సహకారం ఉండడంతో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం సర్వే చేయడానికి పోలీసుల సహకారం కూడా తీసుకున్నామని, అయితే అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అనంతరం పోలీసుల సహకారంతో పొలాన్ని అధికారులు సర్వే చేశారు.