హైదరాబాద్ : ఈ రోజుల్లో జబ్బుచేసి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే కాసులు గుమ్మరించాల్సిందే. ఆ జబ్బు పెద్దదైతే లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజానీకం అయితే ఆస్పత్రి బిల్లుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నాగోల్‌లోని రాక్‌టౌన్ ఏరియాలోగల పవన్ సాయి హాస్పిటల్ పేద, మధ్యతరగతి వర్గాలకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఆస్పత్రి యజమాని ఆలేటి శ్రీనివాస్ గౌడ్.. తన దగ్గరకు వచ్చే పేద వారికి సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన యువకుడికి తన ఆస్పత్రిలో రెండు నెలలపాటు ఉచిత వైద్యం అందించి ఆయన మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా శాలీగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షడు తోట సోమయ్య (టీఆర్ఎస్ సోమయ్య) కుమారుడు తోట భానుప్రసాద్ (24).. గత ఏడాది నవంబర్ 27న రాత్రి బైక్‌పై తన స్వగ్రామానికి వెళ్తూ అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మెడకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఓ 13 రోజులపాటు వైద్యం అందించారు. దాదాపు రూ.15 లక్షలకుపైగా ఖర్చయ్యింది. కానీ పేషెంట్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు.
ఇంకా ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో భానుప్రసాద్ బంధువులు పవన్‌సాయి ఆస్పత్రి యజమాని ఆలేటి శ్రీనివాస్ గౌడ్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. ఎలాగైనా భానుప్రసాద్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన.. మెడిసిన్ ఖర్చులు, వైద్యుల కన్సల్టేషన్ ఫీజులు మినహా పూర్తిగా ఉచిత వైద్యం అందించేందుకు ఒప్పుకున్నారు. దాంతో డిసెంబర్ 8న భానుప్రసాద్‌ను కార్పొరేట్ ఆస్పత్రి నుంచి పవన్ సాయి ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 8 వరకు అంటే సరిగ్గా రెండు నెలలపాటు పవన్ సాయి ఆస్పత్రిలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ రెండు నెలల్లో భానుప్రసాద్ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మేరకు మెరుగుపడింది.
ఈ క్రమంలో భానుప్రసాద్‌ను ఇంట్లోనే పెట్టుకుని సపర్యలు చేసుకుంటామని, డిశ్చార్జి చేయాలని ఆస్పత్రి యజమాని ఆలేటి శ్రీనివాస్ గౌడ్‌ను పేషెంట్ తల్లిదండ్రులు కోరారు. రెండు నెలలపాటు మానవతా దృక్పథంతో ఉచిత వైద్య సేవలు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మీరు మా పాలిట దేవుడు సార్.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం’ అంటూ చేతులెత్తి మొక్కుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టిన భానుప్రసాద్ తల్లిదండ్రులను ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ఓదార్చారు. ఆవేదన చెందవద్దని, మీ కొడుకు కోలుకుంటాడని వారికి ధైర్యం చెప్పారు. కాగా భానుప్రసాద్‌కు పవన్ సాయి ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించిన విషయం తెలుసుకుని ఆ ఆస్పత్రి యజమాని ఆలేటి శ్రీనివాస్ గౌడ్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
