అచ్చంపేట రూరల్, జూలై 9 : ‘మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్’ అంటూ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చిన్నారులు కన్నీరు పెట్టుకుంటూ వేడుకున్న ఘటన మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగిళ్ల శ్రీశైలం తొమ్మిదేండ్లుగా పాఠశాలలో పనిచేస్తున్నాడు. విద్యతోపాటు సమాజంపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక కృత్యాలను తయారు చేసి ప్రత్యేకంగా బోధించేవారు. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ఎంతో ప్రోత్సహించారు. విద్యార్థులకు చదువంటే ఇష్టంగా మారేలా మెలిగేవారు. దీంతో ఇన్నేళ్లు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు వెళ్తుంటే ఆ పాఠశాల విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.