బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటాపాటలకు విశాలమైన మైదానం, డిజిటల్ స్క్రీన్‌పై విద్యాబోధన, కంప్యూటర్ నేర్చుకునేందుకు ప్రత్యేక ల్యాబ్ వంటి వసతులను చూసి వహ్వా అనక మానరు! ఇంగ్లిష్ మీడియం బోధన కూడా ప్రవేశపెట్టడంతో సర్కారు బడుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 461 పాఠశాలల్లో గతేడాది 65,460 మంది విద్యార్థులు చేరగా.. ఈ సారి ఆ సంఖ్యకు అదనంగా 2,800 మంది న్యూ అడ్మిషన్ తీసుకున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులు వెలిశాయి. రాష్ట్రంలో వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 16 ఉండగా.. అందులో గద్వాల జిల్లాలోనే నాలుగు ఉండడం విశేషం. ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తుండడంతో పాస్ పర్సెంటేజీ కూడా పెరుగుతున్నది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– గద్వాల, ఆగస్టు 7
గద్వాల, ఆగస్టు 7 : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు, వసతులతో ముస్తాబు చేస్తోంది. దీంతో రోజురోజుకూ ప్రభుత్వ బడులకు క్రేజ్ పెరుగుతోంది. ఉపాధ్యాయులు బడిబాట చేపట్టినప్పుడు సర్కారు పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను (నాణ్యమైన విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటాపాటలు, విశాలమైన తరగతులు) విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. దీంతో వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. గతేడాది జిల్లాలోని 461 పాఠశాలల్లో 65,460మంది విద్యార్థులు చేరారు. ఈసారి ఆ సంఖ్యకు అదనంగా 2,800మంది చేరారు. అక్షరాస్యతలో వెనుకబాటు అన్న పదానికి స్వస్తి పలికేలా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని నాలుగు హైస్కూల్స్‌లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటేనే సర్కారు బడులకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఆధునిక వసతులను కల్పించడంతో ప్రైవేట్ వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు అన్న చందంగా మారింది.
విద్యాశాఖ అధికారుల అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 16 ఉండగా, అందులో గద్వాల జిల్లాకు చెందినవే నాలుగు ఉండడం హర్శించదగ్గ విషయం. ఈ ఏడాది జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో 1,522మంది విద్యార్థులు విద్యనందిస్తూ రా్రష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. దీంతో ప్రభుత్వ బడుల విద్యార్థుల చదువుకు ఎంతో భరోసా నిస్తున్నా యో ఇట్టే అర్థమవుతున్నది. గద్వాల పట్టణంలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్లో 1,123మంది, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1,120మంది, ధరూర్ హైస్కూల్లో 1,113మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదంతా మనఊరు-మనబడిలో భాగంగా ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాల వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడంతో మరింత ఆదరణ పెరుగుతున్నది. దీంతో పలు పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది.
సర్కార్ బడి.. సౌకర్యాల ఒడి
అమ్మ ఒడిలా సర్కార్ బడులు సకల సౌకర్యాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్కారు ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత బస్‌పాస్‌లు అందిస్తుండంతో గ్రామీణ విద్యార్థులు ప్రైవేట్‌ను వీడి ప్రభుత్వ బడుల్లో చేరేందుకు క్యూ కట్టారు. విద్యాసంవత్సర ప్రారంభంలో బడులుల ప్రారంభమైన కొన్నిరోజులకే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల, అభ్యసన, ధరూర్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి. జిల్లాలోని అన్ని హైస్కూల్స్‌లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. విశాలమైన తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్‌పై ఉపాధ్యాయులు సులభరీతిలో బోధిస్తున్నారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ నేర్చు కోవడానికి మరో ల్యాబ్ ఏర్పాటు చేసి వారికి బోధన చేస్తునారు. అదేవిధంగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు.
ఒత్తిడి లేకుండా విద్య..
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల, ప్రాక్టీసింగ్, ధరూర్ హైస్కూళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా కొత్త ఆలోచనలతో ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. డిజిటల్ తరగతులతో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయడం, పేద విద్యార్థులకు చేయూతనిచ్చింది. చిన్న జిల్లాలు ఏర్పాటు కావడంతో అధికారుల పర్యవేక్షణ పెరిగింది. దీంతో ప్రతి రోజూ విద్యార్థులు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం, ఆటలతోపాటు జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిపై ఆరా తీస్తున్నారు. చదువు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వ బడులకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఎంతో ఊరట కలిగించింది. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల హవా మరింత పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.