ఊట్కూర్ : రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షకు ఓ విద్యార్థి 20 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యాడు. దాంతో అధికారులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు. ఘటనకు సంబంధించి ఎగ్జామినేషన్ అధికారుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఉమేర్ స్థానిక మిల్లత్ ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి చదివాడు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు 20 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యాడు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థి పరీక్ష కేంద్రానికి హాజరుకావాల్సిన సమయం ఇప్పటికే దాటిపోవడంతో గేటు బయట ఉన్న పోలీసులు విద్యార్థిని లోపలికి పంపేందుకు నిరాకరించారు. విషయాన్ని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ సుదర్శన్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పడంతో సదరు విద్యార్థి పరీక్ష రాయకుండానే వెనుతిరిగి వెళ్లిపోయాడు. కాగా రంజాన్ నెల ఉపవాస దీక్షల కారణంగా ఉదయం నిద్రలేచేందుకు ఆలస్యం అయిందని, అందుకే పరీక్షా కేంద్రానికి సకాలంలో హాజరు కాలేకపోయానని విద్యార్థి చెప్పాడు.