బిజినేపల్లి, జూన్ 29 : మండలంలోని మమ్మాయిపల్లి గ్రామంలో గత రెండునెలల కిందట కురిసిన గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయాయి. కానీ నేటికీ వాటి గురించి విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం..మమ్మాయిపల్లి గ్రా మంలో 100కేవీ ట్రాన్స్ఫార్మర్ కింద పది మంది రైతులు గత కొన్నేండ్లుగా విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. కాగా కొన్నిరోజుల కిందట వీచిన గాలివానకు మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ విషయమై నెలరోజుల కిందట స్థానిక లైన్మెన్కు సమాచారం ఇచ్చి రైతులు ఘటనా స్థలాన్ని చూపించినా ఇప్పటికీ విరిగిన స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం చుట్టుపక్కల రైతులు వరి పంటను సాగు చేసేందుకు తుకాలు పోసుకుంటున్నారు. కాగా, గాలివానకు విరిగిన స్తంభాలను పునరుద్ధరించకపోవడంతో వరి తుకాలు పోసుకునే అవకాశం లేకుండా పోతుందని స్థానిక రైతులు పెద్దరాములు, సత్తయ్య, కోటమ్మ, ఆంజనేయులు, కొండయ్య వాపోతున్నారు. ఇదిలా ఉండగా విద్యుత్ అధికారులు మాత్రం స్తంభాలు, సామగ్రి ఉన్నతాధికారుల నుంచి తమకు రావడం లేదని, పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం దురదృష్టకరమని రైతులు ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పం దించి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి తమ బోరుమోటర్లు వినియోగంలోకి వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కాగా, గ్రామంలోని వీధుల్లోనూ స్తంభాలకు విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పా టు చేసినా వాటికి లైన్ తీయడంలో అధికారులు రెండేళ్లు గా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి, ట్రాన్స్‌కో అధికారులకు చెప్పినా పట్టనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.