గద్వాల, నవంబర్ 7 : నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక కమీషన్ల పంచాయితీ ఇంకా తెగలేదు.. దీంతో రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కొనసాగడం లేదు.. గత 20 రోజులుగా నుంచి ఇసుక సరఫరా లేకపోడంతో ఇండ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు ఇసుక రవాణా ఎప్పుడు ప్రారంభమవుతుందో.. ఎప్పుడు పనులు ప్రారంభించుకోవాలో అని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.. అటు టెండర్ పొందిన కాంట్రాక్టర్ పంతం వీడక పోవడంతో అధికారులకు ఏమి చేయాలో తోచడం లేదు..
ఇసుక పంచాయితీ సీఎంవో కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులతోపాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్న వారు తమ నిర్మాణాలు నిలుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక్కడ అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ మధ్య కమీషన్ల పంచాయితీ తెగక పోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవ మంటే పాముకు కోపం..’ అనే రీతిలో ఇక్కడి అధికారులు అటు కాంట్రాక్టర్‌కు చెప్పలేక, ఇటు అధికార పార్టీ నేతలకు చెప్పలేక సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. జిల్లా కేంద్రానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో ఇసుక నిల్వలు అనుకున్న స్థాయిలో ఉన్నప్పటికీ జిల్లాలో గృహనిర్మాణదారులకు ఇసుక దొరకక ఇండ్ల నిర్మాణాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
ఇందు కు ప్రధాన కారణం ఇసుక రీచ్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి మధ్య సయోధ్య కుదరక పోవడమే. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇంటి నిర్మాణాలకు ఇసుక లభ్యత లేకపోవడం, దానికి రాజకీయ జోక్యం తోడు కావడంతో నిర్మాణదారులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ పరిధిలో ఇసుక రవాణా నిలిచి పోవడంతో కాంట్రాక్టర్ తుంగభద్ర నది నుంచి ఇసుకను నది లో నుంచి తీసి పడవల్లో ఆంధ్రా ప్రాంతానికి తరలించుకొని సొమ్ము చేసుకుంటున్నట్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా చేయడానికి రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్ 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలై 3 తర్వాత తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు అధికారులు సూచించిన రూట్‌మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ రవాణాకు అధికార పార్టీ నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ కాంట్రాక్టర్ అడ్డంకులను ఎదురుర్కొంటూ ఇందిరమ్మ ఇండ్లతోపాటు, గృహ, ఇతర నిర్మాణాలకు ఇసుకను సరఫరా చేస్తూ వస్తున్నాడు. అయితే గత 15రోజుల కిందట నడిగడ్డ అధికార పార్టీకి చెందిన ఓ నేత అనుచరులు ఇసుక టిప్పర్లను అడ్డుకోవడం, తమ నేతతో మాట్లాడిన తర్వాత ఇసుక తరలించాలని చెప్పడంతో కాంట్రాక్టర్ గత 15రోజులుగా ఇసుక సరఫరాను నిలిపివేశారు. ఈ విషయం కాంట్రాక్టర్ మైనింగ్ అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది.
అంగట్లో అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని.. ఉన్నట్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల, ఇతర గృహనిర్మాణదారుల పరిస్థితి ఉన్నది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ దానిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కేంద్రం జీఎస్టీ తగ్గించడంతో సిమెంట్ బస్తాల ధరలు తగ్గడంతో ఇండ్లు, ఇతర నిర్మాణాలు చేసుకునేందుకు వినియోగదారులు ముందువస్తున్న తరుణంలో ఇసుక సరఫరా వారి నిర్మాణాలకు తీవ్ర ఆటంకంగా మారింది. సమీపంలోనే మన జిల్లాకు అవసరమైన ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ దానిని రాజకీయ జోక్యం కారణంగా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్ నేను నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా చేస్తున్నామని ఎవరికి ముడుపులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని పంతం పట్టి కూర్చోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముడుపుల విషయం ఉన్నతాధి కారులకు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ వాపోయారు. నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తుంటే ముడుపులు ఎందుకు ఇచ్చుకోవాలని కాంట్రాక్టర్ అన్నట్లు సమాచారం.
20 రోజులుగా రీచ్ నుంచి ఇసుక సరఫరా నిలిచి పోయినా జిల్లా అధికారులు, మైనింగ్ అధికారులకు చీమ కుట్టినట్టు లేదని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోపాటు ఇతర గృహ వినియోగదారులు వాపోతున్నారు. కాంట్రాక్టర్, రాజకీయ నాయకుల మధ్య ఉన్న పంచాయితీ మాకు శాపంగా మారిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జోగుళాంబ గద్వాలకు ప్రభుత్వం మొదటి విడుతగా ఏడు వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఈ ఇండ్లకు ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరా చేయాల్సి ఉంది. అయితే కేవలం ఇప్పటి వరకు జిల్లాలో 720 ఇండ్లకు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు తెలిసింది. తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక కోసం ఇందిరమ్మ లబ్ధిదారులతోపాటు ఇతర గృహ వినియోగదారులు, ఇసుక కోసం టీజీఎండీసీ ద్వారా ఆన్లైన్లో వినియోగదారులు ఇసుక యూనిట్లకు దరఖాస్తు చేసుకొన్న రెండు నెలలైనా లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇసుక సరఫరా కావడం లేదు. దీనిని పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవరిస్తుండండతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇందిరమ్మ గృహాలకు ఇసుక సరఫరా చేయాల్సిన మైనింగ్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తమకు ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని ఆయా మండలాల లబ్ధిదారులు కలెక్టర్ సంతోష్‌ను కోరుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం శాండ్ యాప్‌తో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేస్తామని హైదరాబాద్‌లో మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అధికారుల సమావేశంలో వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు నిరంతరాయంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, జోగుళాంబ గద్వాల జిల్లాలో అందుకు విరుద్ధంగా ఉన్నది. ఇక్కడి ఇందిరమ్మ లబ్ధిదారులకు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక అందకపోవడంతో అధికారుల తీరును లబ్ధిదారులు, వినియోగదారులు తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు, వినియోగదారులు కోరుతున్నారు.