మహబూబ్ నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 3: రెవెన్యూ ఉద్యోగులుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం కోరుకుంటున్న సంక్షేమం, ఇతర శాఖాపరమైన పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ అంశాల గురించి మనమంతా ఒక చోట కలిసి చర్చించుకోవాల్సిన సందర్భం, సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ-గద్వాల, నారాయణపేట జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సమస్యల పరిష్కారంలో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుని మనందరం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భూసమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు. ఆప్షన్ల పద్ధతిలో జీపీవో నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ సాధించిన విజయం అన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూశాఖలోకి వస్తున్న జీపీవో గ్రామ పరిపాలన అధికారులు సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదని, జీపీవోలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు. సమీప భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తునమన్నారు.
61 సంవత్సరాలకు పైబడిన వీఆర్పలను సర్దుబాటు చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేసేలా, కారుణ్య నియామకాలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉద్ఘాటించారు. వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 330 మందిని అధికారికంగా అవుట్ సోర్సింగ్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించడం జరిగిందని, 670 మంది ఫీల్డ్ అండ్ టెక్నికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ కార్పోరేషన్‌కు బదిలీ చేసేందుకు శాయాశక్తుల కృషిచేస్తున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను లబ్దిదారులకు అందించేందుకు మనందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేశ్పాక, టీజార్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రాధ, సీసీఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణచైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేషం, టీజీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షులు సుజాత చౌహాన్, టీజీటీఏ ఉపాధ్యక్షులు పాల్‌సింగ్, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్‌రావు, మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావ్, పేట అదనపు కలెక్టర్ బెంజ్శాలం, ఆర్డీవో నవీన్, డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, ఉమ్మడి జిల్లా టీజీటీఏ అధ్యక్ష కార్యదర్శులు ఘాన్సీరామ్, ఇబ్రహీం, రమేశ్రరెడ్డి, జిలానీ, వీరభద్రప్ప, నరేందర్, శ్రీకాంత్, కృష్ణయ్య, తబితా, వెంకటేశ్, టీజీఆర్ఎస్ఏ నాయకులు శ్రీనివాస్, దేవేందర్, చైతన్య, శ్యాంసుందర్‌రెడ్డి, లక్ష్మీకాంత్, ప్రశాంత్, రమేశ్, రాములు, కరుణాకర్, కిరణ్ కుమార్, బాలరాజు, రెవెన్యూ ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.