మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 1 : జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో జరిగిన 68వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలబాలికల విభాగాల్లో పాలమూరు జట్లు చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో రన్నరప్‌గా రంగారెడ్డి, బాలుర రన్నరప్‌గా నల్లగొండ జట్లు నిలిచాయి. బాలుర, బాలికల్లో మెదక్ మూడోస్థానానికి పరిమితమైంది.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. చివరి వరకు సాగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 02-00 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. బాలుర ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 2-1 పాయింట్ల తేడాతో నల్లగొండపై గెలుపొందింది. అనంతరం ఏఎంవో దూకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రగ్బీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఐకమత్యంతో జాతీయస్థాయిలో విజయం సాధించాలన్నారు.
జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి ఫైనల్ మ్యాచ్‌కు ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ శారదాబాయి, రగ్బీ టోర్నీ అర్గనైజింగ్ సెక్రటరీ నిరంజన్‌రావు, టోర్నీ రాష్ట్ర పరిశీలకుడు కిష్టయ్య, పేటా టీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, యోగా సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు, పీడీలు బాలరాజు, వేణుగోపాల్, వడెన్న, పరశురాం, స్వప్న, నర్సింహులు, మేరీపుష్ప పాల్గొన్నారు.