మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 16 : విద్యారంగంలో పాలమూరు యూనివర్సిటీ అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సూచించినట్లుగా మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి అంతిమ లక్ష్యం కావాలని సూచించారు. యూనివర్సిటీలో సంపాదించిన జ్ఞానం, ధైర్యం, వినయం, అంకితభావంతో నూతన ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్నారు.
పీఎం ఉషా పథకం కింద రాష్ట్రంలోనే రూ.100కోట్లు పొందిన విశ్వవిద్యాలయం పీయూ కావడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకొని ఎదిగేలా, దేశం గర్వించేలా జ్ఞాన ఆధారిత సమాజాన్ని పాలమూరు యూనివర్సిటీ నిర్మించాలన్నారు. డిగ్రీలపైనే కాకుండా విద్యా దృఢత్వం, నాణ్యతా ప్రమాణాలు, జ్ఞానం, వ్యక్తిత్వాన్ని రూ పొందించడంలో విశేష కృషిచేయాలన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే జాతీయ ప్రచారాన్ని తెలంగాణలో ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరారు. తల్లిపేరిట ఒక మొక్కను నాటడం అనేది పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రధాని చెప్పినట్లు దేశ బలం యువత విద్యలోనే ఉందన్నారు. అంతకుముందు గవర్నర్ వర్మకు పీయూ సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : వీసీ
పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం జరుపుకోవడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం వి ద్యా సమగ్రతను పెంపొందించడానికి శోధ్ గంగ (థీసిస్ రిపోజిటరీ), శోధ్ గంగోత్రి(పరిశోధన, ప్రతిపాదనలు), శోధ్శుద్ధి (యాంటీ-ప్లాజియారిజం సాప్ట్వేర్)లలో విశేష కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఫ్యాకల్టీ సభ్యులు రూ.5కోట్ల విలువైన పరిశోధన ప్రాజెక్టులు పూర్తి చేశారని, ప్రస్తుతం రూ.1.2 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. 2022 నవంబర్ నుంచి అక్టోబర్ 2025 వరకు కార్యకలాపాలు, విజయాలపై నివేదికను సమర్పించారు.
అభివృద్ధికి సహకరిస్తా..: మన్నె
ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా యూనివర్సిటీ అభివృద్ధిలో కీలకభూమిక పోషిస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరు న్న పాలమూరు నేడు అభివృద్ధిపథంలో పయనిస్తున్నదన్నారు. యువత భవిష్యత్తులోకి ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టేందుకు అవసరమైన శక్తిని యూనివర్సిటీ ఇస్తుందన్నారు. పాలమూరు భవిష్యత్తు నేడు పట్టభద్రులవుతున్న యువ గ్రాడ్యుయేట్ల చేతుల్లో ఉందన్నారు. యువత విద్యా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలతో పాలమూరుకు మరింత ఖ్యాతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.
అట్టహాసంగా..
జిల్లా కేంద్రంలోని పీయూలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవం సంబురంగా కొన సాగింది. ఈ సందర్భంగా 12 మందికి పీహెచ్డీ అవార్డులు, 83 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఎంఎస్ఎన్ కంపెనీ చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిరబోయి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి, పీయూ మాజీ వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్‌రాథోడ్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, క్రీడల ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, సీవోఈ ప్రవీణ, పబ్లిసిటీ కన్వీనర్, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ కుమారస్వామి, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పీయూ పీఆర్వో గాలెన్న, అర్జున్, రవి, జ్ఞానేశ్వర్, ప్రొఫెసర్లు, హెచ్వోడీలు పాల్గొన్నారు.