మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 9 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తున్నా మని, కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటైందని, అదే పార్టీ రాష్ర్టాన్ని సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసిన కేసీఆర్.. పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసి ప్రజలు విసిగిపోతు భవిష్యత్తులో కేసీఆర్, బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్‌ను విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేయడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపురితమైన హామీతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలలో రుణమాఫీ పూర్తికాలేదని, రైతుబంధు రాలేదని, కల్యాణలక్ష్మి రూ.లక్ష, తులం బంగారుకు దిక్కులేదని, రూ.4 వేల పింఛన్ రాలేదన్నారు. ఆరు గ్యారెంటిల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైదని విమర్శించారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు విద్యార్థులపై లాఠీచార్జి చేశారని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని వెల్లడించారు.
అనంతరం షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో నష్టపోయిందని, రాజకీయంగానే తెలంగాణ వస్తుందనే ఆలోచనతో బీఆర్ఎస్ పెట్టి గాంధేయ పద్ధతిలో పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ సాధించిన తరువాత చరిత్రలో నిచిపోయే విధంగా అభివృద్ధి చేశామన్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీఆర్ఎస్ కార్యాలయంలో బహిరంగసభ పోస్టను అంటించడంతోపాటు వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం సీపీఎం(ఎంఎల్) పార్టీకి చెందిన జిల్లా నాయకుడు అంబదాస్తోపాటు పలువురు మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భం గా అంబదాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గతంలో మహబూబ్‌నగర్‌లో చేసిన అభివృద్ధి, ప్ర స్తుతం రైతులు, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయాల మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, నాయకులు దేవేందర్‌రెడ్డి, సాయిలుయాదవ్, గిరిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, శ్రీకాంత్‌రెడ్డి, శరత్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.