హన్వాడ, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవనంలో హన్వాడ మాజీ ఎంపీటీసీ కుమారుడు పెంటయ్య, మాజీ ఉపసర్పంచ్ గంగాపూరితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటయ్య, లక్ష్మయ్య, గోవర్ధన్‌గౌడ్, చెన్నయ్యతోపాటు మరికొందరు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రమణ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెడేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చేసింది శూన్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్నదన్నారు. రైతులు ఎరువుల కోసం ఇండ్లను, పనులను వదిలిపెట్టి యూరియా కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. రైతులకు అవసారమైన ఎరువుల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరినాట్లు వేసుకొని రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పంపిణీ చేయకపోతే కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిగాలు చెందుతున్నారని తెలిపారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ను సొంత పార్టీ నాయకులే నమ్మడం లేదని, పదేండ్లు తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. హన్వాడ మండలం నుంచి ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడనున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలరాజ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ నాగన్న, గ్రామ అధ్యక్షుడు మాధవులుగౌడ్, నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.