కొల్లాపూర్ రూరల్, జనవరి 18 : మండలంలోని సింగవట్నంలో ఈనెల 15 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణతో రథం కదిలిన ప్రతి క్షణం ఆధ్యాత్మిక భావోద్వేగాలు భక్తుల మనుస్సులో పులకించాయి. రథోత్సవం కంటే ముందు గర్భగుడిలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తులు గోవింద నామస్మరణలు, గుడిగంటల మోతలతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది. ఆలయ ప్రధాన అర్చకుడు సంపత్ కుమార్‌శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు స్వామి వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
పూజా కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ ఎస్వీకేకేబీ ఆదిత్య లక్ష్మారావు పాల్గొని సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి దయతో కొల్లాపూర్ ప్రాంతం పచ్చగా ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకుడు సంపత్ కుమార్ శర్మ రథోత్స గంట మోగించడంతో రథోత్సవం ముందుకు కదిలింది. వేలాది మంది భక్తులు ప్రత్యేక్షంగా పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ప్రధాన ఆల యం నుంచి లక్ష్మీదేవమ్మ గుట్ట వరకు స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు.
ఎన్నో ఏండ్లుగా లక్ష్మీ నర్సింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే రాయలసీమ భక్తులు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా అవస్థలను ఎదుర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కృష్ణానదిలో బ్ర హ్మోత్సవాల సందర్భంగా బోట్ల రాకపోకలను నిలిపివేయడంతో 200 కిలోమీటర్లు దూరం ప్రయా ణం చేసి స్వామిని దర్శించుకుంటున్నారు.