నారాయణపేట, జూలై 9 : వరుణదేవుడు దోబూచులాడుతున్నాడు. మబ్బులు ఊరిస్తున్నా.. కరుణించడం లే దు. వానకాలం సీజన్ ప్రారంభమైన నెల దాటుతున్నా నారాయణపేట జిల్లాలో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి వర్షాలతో పలువురు కర్షకులు దుక్కి దున్ని సిద్ధంగా ఉంచిన పొలాల్లో వివిధ విత్తనాలు విత్తారు. కానీ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోడంతో భూమిలోనే విత్తనాలు మురిగిపోతున్నాయి. దీంతో అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు గంగలో పోసిన పన్నీరే అవుతోందని దిగాలు చెందుతున్నారు.
నారాయణపేట జిల్లాలో వానకాలం సీజన్లో 4,50, 054 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. వీటిలో అధికంగా 1,98,253 ఎకరాల్లో వరి ఉండగా.. ఇప్పటి వరకు 10,636 ఎకరాల్లో పంట సాగైంది. తర్వాత 1,85,323 ఎకరాల్లో పత్తి సాగు కానుండగా.. 1,52,196 ఎకరాల్లో మొలకలు, విత్తనాలను రైతులు నాటారు. అలాగే కంది 57,763 ఎకరాల్లో.. పెసర 754 ఎకరాల్లో.. జొన్న 4,144 ఎకరాల్లో.. మొక్కజొన్న 230 ఎకరాల్లో సాగు కానున్నది. జిల్లాలో అధిక శాతం వరి, పత్తి పంటలే సాగుకానున్నట్లు చెప్పొచ్చు.
పేట జిల్లాలోని వివిధ మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు సాగువుతుంటాయి. ప్రతి ఏడాది మృగశిర కార్తెలో తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు వేసే పనుల్లో రైతులు నిమగ్నమై ఉంటారు. ఈ ఏడాది కూడా పొలాల్లో విత్తనాలను నాటారు. కానీ వానకాలం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మృగశిర దాటినా ఆశించిన వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. పత్తి సాగులో సరైన సమయంలో విత్తనం వేయడం అత్యంత కీలకం. ఆలస్యంగా విత్తితే మొకల ఎదుగుదలపై ప్రభావం పడటమే కాకు ండా పురుగుల బెడద, వ్యాధులు పెరిగే అవకాశం ఉంటు ంది. చివరకు దిగుబడి తగ్గి నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. అందుకే సకాలంలో వర్షాలు కురవాలని రైతులు వేడుకుంటున్నారు. మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో మంచి వర్షాలు కురిస్తేనే మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
మరింత ఆలస్యమైతే పంటల ప్రణాళిక మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పదని వాపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు. తగినంత తేమ లేకుండా విత్తనం వేస్తే మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పల్లెల్లో ఒకే చర్చ సాగుతోంది.. ‘ ఎప్పుడు వాన పడుతుంది.. ఎప్పుడు పొలాల్లోకి వెళ్తాం?’ అని, ప్రతి రైతు చూపు ఆకాశం వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. వర్షం కురిస్తేనే పొలాల్లో సందడి మొదలవుతోంది. రైతుల మొఖాల్లో చిరునవ్వులు విరుస్తాయి. రైతుల ఆశలన్నీ ఇప్పుడు వరుణుడి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. సమయానికి వర్షాలు కురిసి పుడమితల్లి పులకరించాలని.. రైతు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని.. మంచి పంటలు పండించి అన్నదాత ఆనందంగా ఉండాలని జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు.