మహబూబ్‌నగర్, మే 6 : దళితుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజావాణిలో దళితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయడంతోపాటు జిల్లాలో దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై 12మంది ఫిర్యాదులను సమర్పించారని, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, సోషల్ వెల్ఫేర్ డీడీ యాదయ్య పాల్గొన్నారు.
ప్రతిమొక్కనూ కాపాడాలి
నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వాటరింగ్డేను పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా చెట్లతో కలిగే లాభాలను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయించారు.
ఆర్ఎంపీలు సిజేరియన్లు చేయొద్దు
ఆర్ఎంపీ డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్లు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని, నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని కలెక్టర్ వెంకట్రావు హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో గైనకాలజిస్టులు సాధారణ కాన్పులు చేయాలని సూచించారు. ముహూర్తం చేసుకొని ఆపరేషన్‌తో బిడ్డకు జన్మనివ్వడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలా చేయాలనుకునే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. డాక్టర్లు ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని సూచించారు. సిజేరియన్ ఆపరేషన్లతో కలిగే నష్టాలు, సాధారణ కాన్పు లాభాలపై డాక్టర్లతోపాటు కిందిస్థాయిలో పనిచేసే నర్సులు, సిబ్బందికి 15వ తేదీలోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్‌వో కృష్ణ, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ ఉన్నారు.
పనులను పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మల్టీపర్సన్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఎంవీఎస్ కళాశాలలో నిర్మిస్తున్న శ్రీనివాస స్టేడియం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన 400 మీటర్ల ట్రాక్, రహదారుల విస్తరణ, సీసీరోడ్లు, ఆర్చీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంవీఎస్ కళాశాల మైదానంలో శ్రీనివాస స్టేడియం పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, పీఆర్ ఈఈ నరేందర్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఈఈ జైపాల్‌రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీడీఈ రాములు తదితరులు ఉన్నారు.