ఆత్మకూరు, నవంబర్ 1 : భక్తులు కురుమూర్తిస్వామి పవిత్రతను కాపాడుకుంటూ పోలీసులకు సహకరించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కోరా రు. ఉమ్మడి జిల్లాలోనే పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈనెల 6న జరిగే అలంకారోత్సవంపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో సమీక్ష అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ భక్తులు పోలీసులకు సహకరించాలన్నారు.
ఆత్మకూరు ఎస్బీఐ నుంచి ప్రా రంభమయ్యే అలంకార మహోత్సవానికి రెండంచెల బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు, స్వామివారి ఆభరణాలను అ త్యంత పవిత్రంగా, సురక్షితంగా కొండపైకి చేర్చేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ ఆభరణాలను దర్శించుకోవాలని, పోలీసుల ఆంక్షలకు సహకరించాలని సూచించారు.
నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారంగా ఆభరణాల ఊరేగింపును భారీ ఎస్కార్ట్‌తో తీసుకెళ్తామని వివరించారు. జిల్లాలో క్రైమ్‌రేట్ చాలా తగ్గింద ని, సీసీ కెమెరాల ఏర్పాటుతో కేసులు త్వరితగతిన పరిష్కరించబడుతున్నాయన్నారు. ఆధునిక సాంకేతికత్వంతో క్లిష్టమైన కేసులను సహితం సులువుగా పరిష్కరించవచ్చని చెప్పుకొచ్చారు. మొబైల్ రికవరీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. జాతరలోనూ ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా వెంటనే ఠాణాలో సంప్రదించి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, ఎస్సై వాకిటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.