వనపర్తి టౌన్, మే 11 : అన్నదాతలను ఆగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలు తాళ్ల చెరువు, చిమనగుంటపల్లి, గోపాల్పేట, వనపర్తి మార్కెట్‌యార్డును పరిశీలించి రైతుల గోడు విని మార్కెట్ యార్డులో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రతిగింజ కొంటాం అన్న మంత్రుల, అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకున్న, కరెంట్ కోతలు ఉన్నా, సాగునీరు ఇవ్వకున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనకుండా రైతులను అరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్, హమాలీల కొరత , గన్నీ బ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
యాసంగి పంటలో ఎటువంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యాసంగిలో రైతులు 65లక్షల45వేల ఎకరాల్లో వరిసాగు చేశారని, కోటి50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ కేవలం 16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్నారు. అదేవిధంగా మొక్కజొన్న పంట 16లక్షల46వేల ఎకరాల్లో సాగు చేయగా అధిక దిగుబడి రాగా, నేటికి ఒక్క క్వింటా మొక్కజొన్న కొనుగోలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు సకాలంలో యూరియా, కరెంట్, సాగునీరు అందించి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు వైభవంగా గ్రామాల్లో బొడ్రాయి, పెద్దమ్మ పండుగలు నిర్వహించుకొని సౌభాగ్యంగా ఉన్నారని కొనియాడారు. కనీసం యూరియా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి వెంట నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, మాణిక్యం, భానుప్రకాశ్, రఘువర్ధన్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, గంధం పరంజ్యోతి, మురళీసాగర్, శ్రీకర్‌గౌడ్, స్వప్న భాస్కర్, బాలరాజు, తిరుపతయ్య, ధర్మానాయక్, హేమంత్ముదిరాజ్, వెంకట్‌సాగర్, జోహెబ్హుస్సేన్, మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, పోతులపల్లి రాజు, నందిమల్ల రమేశ్, కవితానాయక్, నీలస్వామి, గులాం ఖాదర్‌ఖాన్, హరీఫ్, పాషా ఉన్నారు.