వనపర్తి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పరిపాలనలో కేసీఆర్ అవసరాన్ని అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం కోసం సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో కార్యకర్తల సన్నాహాక సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో స్వపరిపాలన, స్వేచ్ఛ తొలి సీఎం కేసీఆర్ వల్లే సిద్ధించాయన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పదేండ్లు పాలన కొనసాగిందన్నారు. కొంత మంది కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయినా ప్రజల్లో ఇప్పటికీ కేసీఆర్‌పై ఏమాత్రం అభిమానం తగ్గలేదని గుర్తు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుకు అనేక హామీలు ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దీంతో కేసీఆర్ ప్రాధాన్యత, బీఆర్ఎస్ అవసరం ప్రజలకు తక్కువ సమయంలోనే తెలిసి వచ్చిందన్నారు. త్వరలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అందులో భాగంగా నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని, ఈ మేరకు గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు, రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతిలాంటి ఎన్నో పథకాలు అమలు చేయని పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అద్యక్షుడు రమేశ్‌గౌడ్, మీడియా కన్వీనర్ అశోక్, కురుమూర్తియాదవ్, కృష్ణానాయక్, లక్ష్మారెడ్డి, కర్రెస్వామి, తిరుమల్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గిరి, రాము, సునీల్, విజయ్‌కుమార్, దిలీప్ రెడ్డి, రాళ్ల కృష్ణయ్య, మాణిక్యం, వేణు, శారద, నాగమ్మ, కవిత, సాయిలీల తదితరులు పాల్గొన్నారు.