వనపర్తి, జనవరి 11(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఆదివారం వనపర్తి మున్సిపాలిటీలోని 33వార్డుల ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరంజన్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించేందుకు కార్యచరణ తీసుకోవాలన్నారు. కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, నిత్యం ప్రజల్లో ఉండేవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. వార్డుల్లోని ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గుర్తు చేస్తూ ఓట్లు అడగాలని, వనపర్తి మున్సిపాలిటీ పరంగా జరిగిన పనులను ప్రజలకు విశ్లేషించడంతో గెలుపు సునాయసమవుతుందన్నారు.
జరిగిన అభివృద్ధితోపాటు రేవంత్ సర్కారు రెండేళ్ల వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టి ప్రజలకు అర్థం చేయించాలని, వీలైనన్నీ ఎక్కువ సార్లు ప్రజలను కలిసి చర్చించడం, మాట్లాడటం చేయాలని ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు. విశ్రాంతి లేకుండా వార్డు ప్రజలతో మమేకం కావాలని, ఎన్నికల్లో విజయం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి వా ర్డులోనూ అభివృద్ధి పనులు చేయించామని, వీటి ద్వారా నే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో అభివృద్ధి పనులను ఎంతలా పెండింగ్ పెట్టిందో కూడా ప్రజలకు వివరిస్తూ మున్నిపల్ ఎన్నికల్లో ఐకమత్యంగా పోరాడి 33వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని నిరంజన్‌రెడ్డి కార్యకర్తలకు నిర్దేశం చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై జనంలో చర్చించాలని, వంద రోజుల్లోనే పరిష్కారం చేస్తామని హామీలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే 800రోజులు గడిచాయని, గ్యారెంటీలు మాత్రం యథావిదిగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తుందని, నోటిఫికేషన్, షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా గులాబీ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ, గతంలో చేసిన అభివృద్ధిని వివరించడంతో వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్వవైభవం తీసుకురావడం ఖాయమని రావుల భరోసా ఇచ్చారు. ప్రజల్లో మంచి పేరు, సేవాభావం గల వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి విజయానికి సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం రాని చురుకైన అభ్యర్థులకు పార్టీ వివిధ రకాల పదవుల బాధ్యతలను అప్పగిస్తుందన్నారు. 45ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నానని, ప్రస్తుతం అనేక మార్పులొచ్చాయని నిరంతరం ప్రజల్లో ఉంటూ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రావుల కోరారు.
వనపర్తి టౌన్, జనవరి 11 : జిల్లా కేంద్రంలోని 7వ వార్డుకు చెందిన సింగనమోని వెంకటయ్య ఆధ్వర్యంలో 200మంది మహిళలు, యువకులు ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వాస్తవాలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని , మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.