వనపర్తి టౌన్, జూన్ 8 : వలస ఓటర్లపై అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల నమో దు నిరంతర ప్రక్రియ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. 316 బూత్‌లలో ఏజెంట్లు ప్రతి రోజూ ఓటర్ల వడపోతలో పాల్గొనాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఏజెంట్లు క్రి యాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం మాజీ మంత్రి తన స్వగృహంలో సర్ ప్రక్రియ, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటరు నుంచి తీసివేయడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టేందుకు జూన్ 25 నుంచి జులై 25 వరకు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టనుందన్నారు. బీజేపీ ఇతర రాష్ర్టాలలాగానే తెలంగాణలో ఓటరు జాబితా వారికి అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేసేందుకు పూనుకుంటుందని దానిని తిప్పికొట్టేందుకు పనిచేయాలన్నారు.
బీఆర్ఎస్ చేపట్టబోయే సభ్యత్వ నమోదులో నిఖార్సైన కార్యకర్తలను చేర్చాలని మాజీ మంత్రి చెప్పారు. కీలకమైన సమయంలో శ్రేణులు కష్టించి పనిచేయాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొనాలన్నారు. సభ్య త్వ నమోదు కోసం బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ గళం విప్పి సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిదులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.