గద్వాల, సెప్టెంబర్ 8 : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రానున్న సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడుతో కలిసి పరిశీలించారు. అంతకుముందు వారు గద్వాల మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ ఇంటి లో తేనేటి విందు స్వీకరించిన అనంతరం బీఆర్ఎస్ భవనలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పదేండ్లలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్నే మార్చేసిందన్నారు. దేశంలో తక్కువ అప్పులు ఉన్న, ఎక్కువ సంపద ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉంటే దానిని ప్రస్తుత కాంగ్రెస్ 21 నెలల పాలనలో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5వేలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను నిండా ముంచాడని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అన్ని సిద్ధం చేసి పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ వస్తే ఉద్యోగాలు ఇవ్వలేకపోయామని వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేక రైతుల బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీ ర్యం చేసి గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించా రు. మూడు నెలలపాటు కృష్ణానది నుంచి వందల టీఎంసీల నీరు కిందకు వెళ్తున్న వాటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నింపలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెదని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని వాటికి రూ.వెయ్యి, 1200 కోట్లు వెచ్చిస్తే పూర్తయ్యే అవకాశం ఉన్నా దానిని పూర్తిగా విస్మరించారన్నారు.
13న గద్వాలలో నిర్వహించే కేటీఆర్ సభను విజయవంతం చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లోనే బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. సాట్ మాజీ చైర్మన్ అంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ గుండెలకు గద్వాల ఎమ్మెల్యే గాయం చేశాడన్నారు. త్వరలో ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కేటీఆర్ తేలుస్తాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యేకు సముచిత స్థానం కల్పించిందని అయినా తల్లిలాంటి పార్టీని వదిలి వెళ్లిపోయి పార్టీకి ద్రోహం చేశాడ
న్నారు. బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుమంతునాయుడు మాట్లాడుతూ ఈనెల 13న గద్వాలలో 15వేల మందితో బహిరంగసభ గద్వాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో గద్వాల ఉప ఎన్నిక ఖాయమని ఇక్కడ అభ్యర్థిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సరైనా పాలన లేక మొత్తం అల్ల కల్లోలంగా మారిందన్నారు. సమస్యలపై బీఆర్ఎస్ మాట్లాడితే రాజకీయం అంటున్నారన్నారు. మీ పాలన గురించి మేము మాట్లాడితే మీ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేయడంతోపాటు యూరియా దొరకక రైతులు కొట్లాడుకుంటున్నా కాంగ్రెస్ వారికి రైతుల సమస్యలు పట్టవని వారికి కమీషన్ల మీద ఉన్న ద్యాస, పాలనపైన గానీ, రైతులపై లేదన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల గోసపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెడుతున్నారని అయితే ఏం సాధించారని సభ పెడుతున్నారని ప్రశ్నించారు. రిజరేషన్లు కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదని ఉద్యోగాల్లో కూడా ఉండాలన్నారు. బీసీలకు మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను బీఆర్ఎస్ గౌరవించి వారికి పదవులు కట్టబెట్టిందన్నారు. జ్యోతిరావు సబ్‌ప్లాన్ కిందరూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామని ఎన్నికల్లో చెప్పారని ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ,కాంగ్రెస్ తెలంగాణ రాష్ర్టాన్ని గొంతు కోయడానికి చూస్తున్నాయన్నారు. బీఆర్ఎస్పై బీజేపీ, కాంగ్రెస్ విషయం కక్కుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అది ఎప్పటికి జరగదన్నారు. పీసీసీ అధ్యక్షుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెబుతున్నాడని ఆ మాట మీద ఆయన నిలబడాలని కోరారు.