వనపర్తి టౌన్, ఫిబ్రవరి 1 : ఎన్నికలు ఎప్పుడూ వస్తే అప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపడం ఆపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత , రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధించడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రజల దృష్టిని మరల్చడానికి వీలుగా కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించాడు. దీంతో వ్యక్తిగతంగా కేసీఆర్‌ను వేధిస్తే ప్రజల మద్దతుతో కేసీఆర్ ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతారని అన్నారు. జిల్లాను ముట్టుకుంటే అగ్గి రాజేస్తామని, పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడితే ఈ తీస్మార్కాన్ వచ్చి మన జిల్లాను రద్దు చేస్తామని గందరగోళం సృష్టిస్తున్నారని, అందుకే ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలని సూచించారు.
జిల్లాను రద్దు చేస్తామన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? జిల్లాను ఏర్పాటు చేసిన అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటు వేస్తారా? ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలు, తీవ్రవాద సమస్య వంటి సమాచారాన్ని ఇంటెలిజెన్సి అందిస్తుందని ఈ మాత్రం అవగాహన లేకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చిలిపి, వెకిలి చేష్టలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని భరించే స్థితిలో ప్రజలు లేరని, రెండేళ్లుగా సిట్ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని , ప్రజలు ఎన్నికల్లో ఎక్కడా ప్రశ్నిస్తారని ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతుందని, రేవంత్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ పేరుతో అక్రమ విచారణ చేస్తుందని, కనీసం లీగల్ సెన్స్ లేకుండా ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని సిట్ పేరుతో కాలయాపన చేస్తుందన్నారు.
ప్రజల దృష్టిని మరల్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందన్నారు. రాష్ట్ర సర్కారుకు తీరుపై విద్యావంతులు, మేధావులు, ప్రజలు ఆలోచించి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకులు లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, లక్ష్మీనారాయణ, నాగన్నయాదవ్, జోహెబ్హుస్సేన్, జమిల్, పోతులపల్లి రాజు, గిరి, ఉంగ్లం తిరుమల్, ర హీం, మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, కవిత, హే మంత్, ధర్మానాయక్ తదితరులు ఉన్నారు.