వనపర్తి టౌన్, ఏప్రిల్ 30 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు , రాష్ట్ర తొలి ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి స్పందిస్తూ మాట్లాడారు. రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు అడగని పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. పదేళ్ల వరకు కేసీఆర్ అధికారంలోకి రారని రేవంత్‌రెడ్డి భావిస్తే దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి చరిత్రను మరిచిపోయి మాట్లాడుతున్నారన్నారు. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరి నమ్ముకున్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని, అక్కడ సిట్టింగ్ స్థానంలో ఓడిపోయిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని అన్నారు. పదేండ్లు రేవంత్‌రెడ్డి అధికారంలో ఉండే సంగతి తర్వాత ఉన్న ఐదేండ్ల్లు తెలంగాణను ఆగం చేయకుండా పాలిస్తే చాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రగల్భాలు పలుకుతున్నారని, పూటకో మాట మాట్లాడుతూ పథకాల అమలుకు మొఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అమలు చేయకుండా వేధిస్తున్నారని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారన్నారు. అమ్మఒడి ఎందుకు ఆగిందని, గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఎందుకు ఇవ్వకుండా ఆపారని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం ఆపింది ఎవరని, కిశోర బాలికలకు హెల్త్ కిట్ ఎవరు మాయం చేశారని, కేసీఆర్ కిట్ ఎవరు ఎత్తుకెళ్లారని ప్రశ్నించారు. అధికారం కోసం అరచేతిలో వైకుంఠం చూపిన రే వంత్‌రెడ్డి హామీల అమలును ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతల మీద కేసులు, జైళ్లు, చావు లు కోరుకుంటున్నాడన్నారు. శ్రీశైలం సొరంగం హడావుడి పనుల కారణంగా ఎనిమిది మందిని బలిగొన్నారని, కనీసం వారి శవాలను కూడా వారి కుటుంబాలకు అప్పగించకుండా సహాయక చర్యలు నిలిపివేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డిని హామీలు ఏమాయ్యాయని ప్రశ్నిస్తున్నది ప్రతిపక్షాల నేతలు కాదని ప్రజలేనని అని స్పష్టం చేశారు.
ప్రజల ప్రశ్నలు తప్పించుకోవడానికి ప్రతిపక్షాలను రేవంత్‌రెడ్డి అడ్డుపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 17నెలల కాంగ్రెస్ పాలన గాలిమోటర్ పాలనలా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న ప్రతిదానిని ప్రజలు గనమిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు శిక్షించాలన్నా విషయంలో ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉందన్నా రు. సీఎం కు, మంత్రులకు పాలనపై అవగాహన లేక అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ప్రజలు కొద్ది రోజుల్లో బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై కాకుండా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు.