వనపర్తి టౌన్, జనవరి 7: రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రాణాలను రక్షించుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపే వారిని, సీట్బెల్ట్తో కార్ నడుపుతున్న వారిని జిల్లా రోడ్డు రవాణా అధికారి మానస, పోలీస్ సిబ్బందితో కలిసి వాహనదారులకు పూలు ఇస్తూ అభినందించారు.
వాహ నం నడిపే ప్రతిఒక్కరూ తన ప్రాణంతోపాటు ఇతరుల ప్రాణాన్ని రక్షించేందుకు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైతే నిబంధనలు పాటించడం లేదో అలాంటి వారికి జరిమానాలు విధించాలని రోడ్డు రవాణా అధికారిని ఆదేశించారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సునందినీదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి అంజ య్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, ఐటీఐ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు ఉన్నారు.