నారాయణపేట, అక్టోబర్ 2 : నవరాత్రుల్లో భాగంగా అష్టమి రోజున అమ్మవారికి జంతుబలి ఇవ్వడం జిల్లాలో ఆచరంగా వస్తున్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు జాజాపూర్, కోటకొండ, దామరగిద్ద, ఊట్కూరు గ్రామాల్లో సోమ వంశీయ క్షత్రియ సమాజ్ కులస్తులు దసరాను అతి పెద్ద పండుగగా జరుపుకొంటారు.పండుగ సందర్భంగా ఇండ్లను శుభ్రం చేసి రంగులు వేస్తుంటారు.
పూజ గదుల్లో తొమ్మిది రోజులపాటు అఖండ దీపం వెలిగిస్తుంటారు. అష్టమి రోజున రాత్రి అమ్మవారికి జంతుబలి ఇచ్చి.. మరునాడు బంధువులు, స్నేహితులను పిలిచి భోజనాలు పెడుతారు. ఇలా బలి ఇచ్చేందుకు తమదే పెద్ద గొర్రె, మేక ఉండాలని పోటీపడి కొనుగోలు చేస్తుంటారు. కొండగొర్రెలకు ప్రత్యేక పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రంలోని అమీన్ఘడ్కు వెళ్లి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలికే గొర్రెను కొనుగులు చేస్తుంటారు.
అలా ఈ ఏడాది సైతం నారాయణపేట పట్టణంలోని బురుడువాడి ధూల్పేటకు చెందిన కమలాపూర్ ప్రభాకర్ రూ.58 వేలు వెచ్చించి గొర్రె పొట్టేలును కొనుగోలు చేశారు. కొన్నేండ్ల నుంచి నారాయణపేటలో ప్రభాకర్ అత్యధిక ధరకు గొర్రెలను కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది సైతం ఆయనదే పైచేయిగా నిలిచింది.