నాగర్ కర్నూల్ : మంత్రి జూపల్లి ( Minister Jupalli ) ఆదేశాలకు భయపడి అధికారులు నాగర్ కర్నూల్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాడూర్ మండలం పరిధిలోని ఇంద్రకల్ గ్రామ శివారులోని మణికంఠ కాటన్ మిల్లు గోదాం దగ్గర మొక్కజొన్న( Maize ), ధాన్యం బస్తాల లోడింగ్, అన్ లోడింగ్,పరిస్థితిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న అన్లోడింగ్ సమస్యను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నేరుగా గోదాంకు వెళ్లి రైతుల ధాన్యాన్ని అన్లోడింగ్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన మొక్కజొన్న ధాన్యం అన్లోడ్ చేయకుండా కేవలం మంత్రి జూపల్లి ఆదేశాలతో కొల్లాపూర్‌కు చెందిన దళారుల ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కొల్లాపూర్‌కు చెందిన 30 లారీల ధాన్యం అన్లోడ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం దళారుల వ్యవస్థకు మద్దతిస్తుందని తెలిపారు. రైతుల పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల వివక్షత చూపితే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గోదాం వద్ద ఉన్న రైతులకు, డ్రైవర్స్‌కు స్వయంగా భోజనం తెప్పించి పెట్టారు. ఆయన వెంట పలువురు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.