మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 14 : సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగనున్నాయి. ఆ మేరకు తరగతి గదులు, బడుల పరిసరాలను శుభ్రం చేశారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంగణాలను సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పెంచేందుకు వేసవి సెలవుల నుంచే ప్రత్యేక కార్యచరణ అమలు చేశారు.
ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఉన్న వసతులపై ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను పాఠశాల ప్రారంభం రోజే అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ఈనెల 12వ తేదీ ప్రారంభం కావాల్సి ఉండగా.. 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించారు. జూన్ 12న సెలవు ఇచ్చినందున.. దానికి బదులు జూలై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను సురక్షితంగా చేర్చాల్సిన స్కూల్ బస్సుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులు ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోకపోయినా రోడ్లపైకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై తిరగడం విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది.
చిన్న లో పం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. బస్సుల ఫిట్నెస్ విషయంలో అనేక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘా ల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు 21026-27 ఏడాదికి ఎడ్యుకేషన్ కిట్ ఆల స్యం కానుంది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఇవ్వాలని తొలుత భావించినా టెండర్ల నిర్వహణ ప్రక్రియలో అవాంతరాల కారణంగా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. యూనిఫాంలు కూడా ఆలస్యం కానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలు 32, గిరిజన సంక్షేమ గురుకులాలు 18, మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ గురుకులాలు 32, మైనారిటీ సంక్షేమ గురుకులాలు 25, తెలంగాణ రాష్ట్ర గురుకులం-1, కేజీబీవీలు 72, ప్రభుత్వ పాఠశాలలు-3,231, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాలయాలు 1250కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీల్లో మొత్తం 4.20లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా చర్య లు తీసుకుంటున్నట్లు మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి తెలిపారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. యూనిఫాంలు కూడా విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యా సంవత్సరం వార్షిక క్యాలెండర్ను విధిగా అమలు పర్చాలని డీఈ వో సూచించారు.