మహబూబ్నగర్ కలెక్టరేట్/వనపర్తి టౌన్, జూన్ 12 : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉల్లాసంగా.. ఉషారుగా పాఠశాలలకు రావడం కన్పించింది. తన స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ వేసవి సెలవులను ఎలా గడిపారో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు చాలా పలుచగా, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా కన్పించింది. ఇంకొన్ని పాఠశాలకు హాజరైన విద్యార్థులకు
ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలికారు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి కొత్త అడ్మిషన్లతో హడావుడి కనిపించింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్లో బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, పాఠశాలల పునః ప్రారంభోత్సవం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం, న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి వి.ఈశ్వరయ్య హాజరయ్యారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.