వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు తెరుచుకున్నాయి.. బడిగంట మోగింది.. 52 రోజుల తర్వాత బడులు పునఃప్రారంభ మయ్యాయి.. తొలి రోజు సోమవారం అమావాస్య ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదైంది. మొదటి రోజు పాఠశాలల భవనాలను అందంగా ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు కట్టి.. రంగుల కాగితాలు అతికించి.. ఆవరణలో ముగ్గులు వేసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
పలు చోట్ల బడులకు హాజరైన విద్యార్థిని, విద్యార్థులపై పూల వర్షం కురిపించగా.. మరికొన్ని చోట్ల పూలబొకేలు అందించి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ గురువులకు పాదాభివందనాలు చేశారు. ఈ ఏడాది 229 రోజులు పాఠశాలలు కొనసాగించనున్నట్లు పని దినాల క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం వెంకట్రామ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎవరూ రాకపోవడంతో కేవలం హెచ్ఎం రూపారాణి మాత్రమే హాజరయ్యారు.