– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
చుంచుపల్లి, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి అవసరాలను గుర్తించి సేవలు అందించాలని ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అధికారులకు సూచించారు. సోమవారం చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఎంపీడీవో సుభాషిణితో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి అందరూ అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా అధికారులు పని చేయాలని, అందిన వినతులను సంబంధిత శాఖలకు వెంటనే పంపించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి మొత్తం 22 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో తెలిపారు. గృహజ్యోతి, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, డ్రైనేజీ కాలువలు తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ నాగరాజు, ఎంపీఓ సంధ్య పాల్గొన్నారు.