గద్వాల టౌన్, జనవరి 12 : మంచుతెరల నడుమ నులివెచ్చని రవికిరణాలు వెదజల్లగా.. పుడమి తల్లి పసిడి పంటలు అందివ్వగా.. ప్రకృతి సింగారించుకొని సంక్రాంతికి స్వాగతం పలుకగా.. పట్టు పరికిణిలతో ఆడపడుచుల సందడి.. గాలి పటాలతో చిన్నారుల కేరింతలు ఇలా సరదాలెన్నో సంక్రాంతి మోసుకొచ్చింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊరు వాడా అంతా సంబురాలే. భోగి, సంక్రాంతి, కనుమ పేరిట జిల్లా ప్రజలు మూడు రోజుల పాటు సంబరాలు చేసుకోనున్నారు. పల్లెటూర్లలో డూడూ బసవన్నలు, హరిదాసులు, పగటి వేషగాళ్లు, ఎడ్లపందెలు, కుర్వ డోళ్ల సందడి మరింత ఆకర్షిణీయంగా నిలుస్తాయి. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. పంట చేతికొచ్చిన రోజుల్లో సంతోషంగా జరుపుకొనే సంక్రాంతి రైతులకు పెద్ద పండుగగా చెప్పుకుంటారు. అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ రోజును పవిత్రంగా భావిస్తారు. ఏడాది కాలంలో ఆరు నెలలు ఉత్తరాయణం అని, ఆరు నెలలు దక్షణాయణమని అందరికి తెలిసిందే.
భోగి ముచ్చట్లు..
సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగగా జరుపుకొంటారు. ఈ రోజు సూర్యుడు ధనస్సు రాశిలోంచి మక ర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున స్వర్గలోకపు వాకిళ్లు తెరుస్తారని నమ్మకం ఉంది. అందుకే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో భోగిగా, రాజస్థాన్‌లో మకర సక్రాత్గా, పంజాబ్‌లో హరిగా, నేపాల్‌లో మాఘె సంక్రాంతిగా, థాయిలాండ్‌లో సోంగ్క్రమ్గా, మయన్మార్‌లో థింగ్యాన్గా, అస్సాంలో బోగళిబెహుగా, తమిళనాడులో పొంగల్‌గా, ఒడిశాలో కొత్త సంవత్సరం ప్రారంభంగా భోగి పండుగను జరుపుకోవడం విశేషం.
మకర సంక్రాతి…
నక్షత్రాలన్నింటినీ కలిపి 108పాదాలుగా, 108పాదాలను 12రాశులుగా విభజించారు. ఈ నెలల సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు అందుకే మకర సంక్రాంతి అంటారు. తెలంగాణ ప్రాంతంలో ను వ్వులు, బెల్లం, కలిసి లడ్డులు, నువ్వుల రొట్టెలు, చెగోడి లు, చకినాలు వంటలు తయారు చేసుకుంటారు. అలా గే కూరగాలన్నింటినీ వాయనంగా సమర్పించుకుంటారు. మకర సంక్రమణం నాడు నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి.
కనుమ పండుగ…
మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో కనుమకు ప్రాధాన్యత ఎంతో ఉంది. కనుమ పండుగను పశువుల పండగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కనుమ అంటే పశువు అని అర్థం. ఏడాది పాటు పొలం పనుల్లో తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువులను పూజించడం ఆనవాయితీ. పశువులను, కొ ట్టాలను అలంకరిస్తారు. పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తా రు. అలాగే నేవైద్యాన్ని పొలంలో చల్లి పాడి పంటలు బాగా పండాలని వేడుకోవడం ఆనవాయితీ.
మొదలైన సందడి..
బతుకు దెరువు కోసం దూరప్రాంతాలకు వెళ్లిన వారు సైతం సొంత గూటికి చేరుకుంటున్నారు. బంధువుల, ఆత్మీయుల పలకరింపులతో ఇండ్లన్నీ కళకళలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు తరలిస్తుండడంతో రోడ్లపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు సైతం గ్రా మాలకు కిక్కిరి వస్తున్నాయి. రంగుల కొనుగోళ్ల కోసం వచ్చిన మహిళలు, పండుగ సరుకులు కొనడానికి వచ్చిన ప్రజలతో జిల్లా కేంద్రం సందడిగా మారింది.