వనపర్తి, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : పల్లెసీమలు బాగుంటేనే రాష్ట్ర, దేశ ప్రగతి బాగుంటుంది. గ్రామీణ వ్యవస్థ పట్టుగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటూ చెబుతుంటే.. వినడానికి సొంపుగానే ఉన్నది. నాడు గాంధీజీ కలలుగన్నట్లుగా పచ్చగా కనిపించిన తెలంగాణ పల్లెలు మళ్లీ వెనక్కి వెళుతున్నాయి. సరికదా.. గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కా ర్మికులకు సైతం జీతాలు ఇచ్చుకోలేని దుస్థితి రావడం కొసమెరుపు.
గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేదిస్తున్నది. అభివృద్ధి సంగతి అటుంచితే.. కనీసం కార్మికుల జీతాలు, ట్రాక్టర్ మెయింటెన్స్లాంటి పనులకు కూడా తీవ్ర ఆట ంకం కలుగుతున్నది. చాలా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఓ పైపు వేయాలన్నా.. మోటరు కాలిపోతే రి పేరు చేయాలన్నా కష్టతరమవుతున్నది. సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది గడిచినా ఎ న్నికల ఊసే లేకపోవడంతో వచ్చే రో జుల్లో గ్రా మాలకు మరిన్ని కష్టాలే అన్నట్లు కనిపిస్తుంది.
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ జీపీల వారీగా 1079 మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ జీపీల్లో చాలా వరకు కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నా కష్టంగా మారింది. కొద్దొగొప్పో ఉన్న చోట మాత్రమే కా ర్మికుల వేతనాలు ఇస్తూ అవస్థలతో నెట్టు కొ స్తున్నారు. జిల్లాలోని ఒక్కొక్కచోట ఒకలా కార్మికుల జీతాల సమస్య పీడిస్తున్నది. రెండు నెలల నుంచి మొదలుకొని 8నెలల వరకు జీతాలు రా ని పరిస్థితులు పలు గ్రామ పంచాయతీల్లో ఉ న్నాయి. ఇలా ఒకచోట ట్రాక్టర్ మరమ్మతు సమస్య ఉంటే, మరోచోట కార్మికుల జీతాల స మస్య, ఇంకోచోట కార్మికులు పనులు మానేస్తున్న పరిస్థితులు గ్రామ పంచాయతీలను పీడిస్తున్నాయి.
గ్రామ పంచాయతీ కార్మికులకు ఉగాది సందర్భంగానైనా జీతాలు అందుతాయని ఆశించా రు. ఒకటి కాదు రెండు కాదు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంచడంతో కార్మికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అనేకచోట్ల కార్మికులు చందాలు అడుక్కుంటూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుకున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 15 మం డలాల్లోని గ్రామాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది. ఇంకాను పెద్ద జీపీలు, మద్యస్థ జీపీల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల స్థితిగతులు ఒకలా.. చిన్న జీపీల కార్మికుల పరిస్థితులు మరొకలా ఉన్నాయి. చివరకు పండుగకైనా జీతాలందుతాయన్న కార్మికుల ఆశలు అడియాశలవుతున్నాయి.
ప్రతినెలా కార్మికుల జీతాల కోసం గ్రామ కార్యదర్శులు చెక్కులు కొట్టి ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఇది ప్రతినెలా ఓతంతులా మారింది తప్పా ఎలాంటి ఉపయోగం లేదు. మూడు నెలలు దాటిందంటే వేసిన చెక్కు చెల్లడం లేదు. గడువు ముగుస్తున్న చెక్కుల విషయంలో కనీసం కార్మికుల జీతాల వరకైనా సర్కార్ సానుకూలంగా వ్యవహరించక పోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇలా చాలా నెలలుగా ట్రెజరీల్లో కార్మికుల వేతనాల చెక్కులను ఇవ్వడం కార్యదర్శులకు పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే.. జిల్లాలో 8 నెలలుగా జీతాలందుకోని గ్రామ పంచాయతీలున్నాయి. మరికొన్ని 6,4,2 నెలల వారీగా జీతాలు అందని గ్రామ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం రెండు నెలలు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కార్మికుల జీతాలను టీఎస్ బీపాస్ ద్వారా చెల్లించాలని ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఎస్బీఐలో జీపీ ఖాతాలున్న వాటికి ఇబ్బంది లేకున్నా.. ఇతర బ్యాంకుల్లో అకౌంట్లున్న జీపీలకు రెండు, మూడు రోజుల వరకు ఈ ప్రక్రియ పడుతుందని కార్యదర్శులు చెబుతున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది నెలల తరబడి జీతం ఇవ్వకుంటే మేం ఏం తినాలి. ఎలా పని చేయాలి. మాలాంటి చిన్న కుటుంబాలు నెలకు జీతం వస్తేనే నడిచేది కష్టం. ఇన్ని నెలలు పెండింగ్ పెడితే మేం ఎవరికి చెప్పాలి. మా కొచ్చే చిన్న జీతాలు ఇవ్వకపోవడం దారుణం. ఇక నెలల కొద్ది రాకుంటే మా కష్టాలు ఎవరికి చెప్పాలే. జీతాలడిగితే వచ్చినప్పుడు ఇస్తాం అంటూ కార్యదర్శి చెబుతున్నారు. సర్కారు మాకు చెల్లించాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి.
– ఆంజనేయులు, కార్మికుడు, గట్లఖానాపూర్, పెద్దమందడి మండలం
ట్రెజరీల్లో వేసిన జీపీ కార్మికుల చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన కార్మికుల జీతాలను టీఎస్ బీపాస్ ద్వారా చెల్లించే విధంగా నిధులు విడుదల అయ్యాయి. ఎస్బీఐలో అకౌంట్లున్న జీపీలు వెంటనే తీసుకోవచ్చు. ఇతర బ్యాంకుల్లో అకౌంట్లున్న జీపీలు ఒకరోజు అటు.. ఇటుగా జీతాలు తీసు కుంటారు. ప్రభుత్వ స్థాయిలోనే ట్రెజరీ చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు పెండింగ్ చెక్కులు కూడా క్లీయర్ అవుతాయి.
– సురేశ్, జిల్లా పంచాయతీ అధికారి, వనపర్తి