అలంపూర్, మే 7 : తుంగభద్ర నదిలో ఇసుక దొంగలు పడ్డారు. రాత్రి, పగల తేడా లేకుండా జో రుగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా రు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే నడస్తున్నదని నదీ పరీవాహక గ్రామా ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తె లంగాణ సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ మ ండలం సింగవరం శివారులో తుంగభద్ర న ది ఇసుక మాఫియాకు సిరులు కురిపిస్తున్నది.
వేసవిలో నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతో ఇసుక అక్రమ రవాణా జోరందుకున్నది. ఏపీకి చెందిన మాఫియా జేసీబీలను తీసుకొచ్చి ఇసుకను తోడేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక సీమ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. అక్కడ డంపులు చేసి అవసరం మేరకు యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయ ంగా ‘మూడు పువ్వులు-ఆరు కాయలు’గా వ్యాపారాన్ని కొనసాగిస్తూ జేబులు నింపుకొంటున్నారు.
భయం నీడలో సింగవరం వాసులు
నది నుంచి ఇసుక తరలింపు భారీగా జరుగుతుంటే అడ్డుకోవాలంటే సింగవరం వాసులు జంకుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లతో తరలిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో ‘మూడు జేసీబీలు-ఆరు ట్రాక్టర్లు’ అన్న చందంగా దందా జోరందుకున్నది. స్థానికంగా ఉండే రైతులు, గ్రామస్తులు ఇసుక తరలింపు సమాచారాన్ని అధికారులకు చేరవేసినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఆయా శాఖల్లో పని చేసే సిబ్బంది మాఫియాతో ఉన్న లింకుల కారణంగా అధికారులు దాడులకు వస్తుంటే ముందస్తు సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు.
అధికారులు పేరుకు మాత్రమే దాడులు చేస్తున్నారు కానీ.. మాఫియాను పట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీమ మాఫియా అక్రమాలను చూసి కొందరు యువత ఇసుక తరలింపునకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అయినా సంబంధిత శాఖాధికారుల్లో చీమకుట్టినట్లు కూడా స్పందన లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీమ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మన సహజ సంపద తరలిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఈ విషయమై స్థానిక ఎస్సై వెంకటస్వామిని వివరణ కోరగా.. గతంలో ఇసుక తరలింపు జరిగింది.. ప్రస్తుతం అటువంటిదేమీ లేదని కొట్టిపాశారు. ఇసుక తరలకుండా దాడులు ముమ్మ రం చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫొటోలు పాతవని తోసిపుచ్చారు.
కేసీఆర్ పాలనలో ఇసుక రేణువు కూడా తరలలేదు
మన వద్ద ఇసుక కొరత తీవ్రంగా ఉన్నది. ఇంటి నిర్మాణాల కోసం
ఇసుక కొనుగోలు చేసేందుకు నానా పాట్లు పడుతుంటే ఏపీలో మాత్రం ఇసుక ఫుల్గా లభిస్తున్నది. తుంగభద్ర నదిలో ఎప్పుడు పడితే అప్పుడు దర్జాగా తవ్వకాలు చేపడుతుండడంతో పుష్కలంగా లభిస్తున్నది. నదీతీర ప్రాంతాల ప్రజలు సొంత అవసరాల కోసం ఎడ్లబండ్లపైన ఇసుకను తరలిస్తుంటే.. పోలీసులు అడ్డుకుంటూ కేసులు పెడుతున్నారు. అయితే ఇసుక తవ్వకాలతో నదిలో జలాలు ఇంకిపోతున్నాయి.. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.
బోరు, బావులు ఎండిపోతూ పొ లాలకు నీరందని పరిస్థితి. పెట్టిన పెట్టుబడులు ఎల్లక.. సాగునీరు లేక రైతులు గోస పడుతున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సీమ మాఫియా నదిలోకి దిగాలంటే జంకేది. కానీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో యథేచ్ఛగా తరలింపు కొనసాగుతున్నది. అధికార పార్టీ ఉన్నత స్థాయిలో ఉండే బడా నేతలు.. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి ఎవరి స్థాయిలో వారు అమ్యామ్యాలు సెట్ చేసుకొని మాఫియాతో చేతులు కలిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి