నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 15 : నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక ముడుపుల పంచాయితీ తెగలేదు. ఇంకా రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. దీంతో ఇసుక కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా చేయడానికి రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్ 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలై 3వ తేదీ తర్వాత తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు అధికారులు సూచించిన రూట్‌మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ రవాణాకు అధికార పార్టీ నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ కాంట్రాక్టర్ వాటిని ఎదుర్కొంటూ ఇందిరమ్మ ఇండ్లతోపాటు, గృహ, ఇతర అవసరాలకు లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను సరఫరా చే స్తూ వచ్చాడు.
అయితే ఐదు రోజుల కిందట అధికార పార్టీకి చెందిన ఓ నేత అనుచరులు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. తమ నేతతో మాట్లాడిన తర్వాత ఇసుక తరలించాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. చేసేది లేక కాంట్రాక్టర్ ఐదు రోజులుగా ఇసుక సరఫరాను బంద్ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతతో పాటు అనుచరులు తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలించాలంటే తమకు ముడుపులు ముట్టజెప్పిన తర్వాతే తరలించాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయం కాంట్రాక్టర్, మైనింగ్ అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో ఇసుక రవాణా నిలిపివేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో పాటు గృహ, ఇతర నిర్మాణాలు చేపట్టే వారు ఇసుక దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇబ్బందులు
అధికార పార్టీ నేత తీరుతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నేను ఎవరికీ ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేస్తున్నానని భీష్మించుకూర్చున్నాడు. దీంతో ఇసుక కొరతతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముడుపుల విషయం ఉన్నతాధికారులకు తెలియజేసినా వా రు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ వాపోయారు. నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తుంటే ముడుపులు ఎందుకు ఇచ్చుకోవాలని కాంట్రాక్టర్ అన్నట్లు సమాచారం. ఐదు రోజులుగా రీచ్ నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయినా జిల్లా అధికారులకు గానీ, మైనింగ్ అధికారులకు గానీ చీమ కుట్టినట్టు కూడా లేదని పలువురు వాపోతున్నారు. ఈ పంచాయితీ తమకు శాపంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాకు ప్రభుత్వం మొదటి విడుతగా 7 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాల్సి ఉన్నది. అయితే కేవలం ఇప్పటి వరకు జిల్లాలో 680 ఇండ్లకు మాత్రమే ఇసుక అందించినట్లు తెలిసింది. ఇందిరమ్మ లబ్ధిదారులతోపాటు గృహ, ఇతర వినియోగదారులు ఇసుక కోసం దరఖాస్తు చేసుకొని 40 రోజులైనా తు మ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక లేక విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులు డంప్ చేసిన ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. మంగళవారం రాజోళి మండలం మాన్‌దొడ్డి శివారులో రెవెన్యూ అధికారులు దాడులు చేసి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నిల్వ చేసిన 60 ట్రాక్టర్ల ఇసును సీజ్ చేశారు. రాజోళిలో బుధవారం అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మైనింగోళ్లే రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్‌కు వినతి..
రాజోళి, వడ్డేపల్లి మండలంలోని ఇందిరమ్మ గృహాలకు ఇసుక సరఫరా చేయాల్సిన మైనింగ్ శాఖాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమకు ఇ సుక సరఫరా అయ్యేలా చూడాలని ఆయా మండలాల లబ్ధిదారులు కలెక్టర్ సంతోష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇ సుక కోసం చలాన్లు కట్టి 40 రోజులు కావస్తున్నా సరఫరా చేయడం లే దని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక సరఫరా అయ్యేలా చూ డాలని పలువురు కోరుతున్నారు.