‘సఫాయన్న.. నీకు సలాం’ అనే నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నది. ఇందులో భాగంగానే పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. మే డే ఉత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వేలాది మంది సఫాయన్నలకు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున వేతనం పెంచారు. పురపాలికలు, పంచాయతీల్లో ఈనెల నుంచే పెరిగిన జీతాలు అమలుకానున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,692 గ్రామపంచాయతీలు.. 19 మున్సిపాలిటీలు ఉండగా.. 8,489 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ లబ్ధి చేకూరనుండగా.. సఫాయిలతోపాటు వారి కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నాగర్‌కర్నూల్, మే 2 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులకు తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎల్ఈడీ బల్బులు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. హరితహారంలో భాగంగా నర్సరీలు, పారిశు ధ్యం కోసం ట్రాక్టర్లు మంజూరు చేసింది. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, బృహత్ పల్లె వనాలు, పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నది. ఏటా రెండుసార్లు పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతున్నది. పురపాలికల్లోనూ ఇదే విధంగా అభివృద్ధి జరుగుతున్నది. ఇందులో స్థానిక సంస్థల పాలకులు, అధికారులకు తోడు పారిశుధ్య కార్మికులది కీలక పాత్ర. ప్రభుత్వం చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు డబ్బాలను పంపిణీ చేసింది. ఈ డబ్బాల్లోని చెత్తను ప్రతిరోజూ ఉదయం పారిశుధ్య సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
నిత్యం గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రపర్చడంతోపాటు చెత్తను తొలగించి పారిశుధ్య సమస్య నుంచి విముక్తి కలిగిస్తున్నారు. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలతోపాటు పండుగలు, ఇతర సభలు జరిగితే పారిశుధ్య సిబ్బందే చెత్తను తొలగిస్తున్నారు. కరోనా సమయంలో పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రాణాలకు తెగించి పారిశుధ్యం, ఇండ్లు, వీధుల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, మృతదేహాల ఖననం వంటి పనులు చేశారు. దీంతో ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఈ సిబ్బంది తమ శ్రమను ధారపోస్తున్నారు. తెల్లవారకముందే లేచి రాత్రి వరకూ పల్లెలు, పట్టణాలనే తమ ఇండ్లుగా భావించి పనిచేస్తున్నారు. అలాంటి పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనం పెంచుతూ నిర్ణయించారు. ఒక్కో పారిశుధ్య కార్మికుడికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ మే డే రోజున శుభవార్త ప్రకటించారు. ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు అమల్లోకి రానుండడం గమనార్హం.
ప్రస్తుతం పంచాయతీల్లో ఒక్కో కార్మికుడికి నెలకు రూ.8,500 చొప్పున వస్తుండగా.. ఇకపై రూ.9,500 చొప్పున రానున్నాయి. పురపాలికల్లో రూ.15,600 ఉండగా.. ఇకపై రూ.16,600 రానున్నాయి. దీంతో కార్మికులకు ఆర్థిక భరోసా లభించనున్నది. కార్మికులు, సంఘాల నుంచి ఎలాంటి వినతులు రాకున్నా సీఎం కేసీఆర్ ఈ వేతన పెంపును చేపట్టడం విశేషం. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో 1,922 మంది, నాలుగు పురపాలికల్లో 300 వరకు పారిశుధ్య సిబ్బందికి పెరిగిన వేతనం అమలు కానున్నది. దీంతో వేలాది మంది పంచాయతీ, పురపాలిక పారిశుధ్య సిబ్బంది కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ కష్టాన్ని గుర్తించిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
పేదల కష్టం తెలిసిన సీఎం..
అమరచింత, మే 2 : పేదల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని పారిశుధ్య కార్మికులు తెలిపారు. అమరచింత మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటే ఎవరికీ నష్టం జరగదన్నారు. పట్టణాలను పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. అందుకు కృషిచేసిన పారిశుధ్య కార్మికులను గుర్తు పెట్టుకుని.. వారు అడగకుండానే వేతనం పెంచడం సంతోషంగా ఉందన్నారు. పెరిగిన జీతంతో మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పారిశుధ్య కార్మికులు రవినాయక్, ప్రేమ్‌కుమార్, హరికృష్ణ, తిప్పన్న, కతాల్, సునీల్, మహేందర్, ప్రభాకర్, శ్రీను, నాగమ్మ, మాధవి, సురేశ్, కతలన్న, రాజశేఖర్, ప్రదీప్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చల్లగుండాలి..
మాకు రూ.వెయ్యి పెంచిన సీఎం కేసీఆర్ చల్లగుండాలి. పొద్దస్తమానం పనిచేసే మా కష్టాన్ని గుర్తించినందుకు చా లా ఆనందంగా ఉన్నది. కరోనా సమయంలో పారిశు ధ్యం, ఇండ్లు, బ్లీచింగ్, క్లోరినేషన్, మృతదేహాల ఖన నం వంటి పనులు చేశాం. ఒక్కో పారిశుధ్య కార్మికుడికి రూ.వె య్యి చొప్పున పెంచుతూ శుభవార్త ప్రకటించారు. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– భూదేవి, పారిశుధ్య సిబ్బంది, నాగర్‌కర్నూల్
ఈ నెల నుంచే పెంపు అమలు..
జిల్లాలోని 461 పంచాయతీల్లో 1,922 మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రతి సిబ్బందికి ఈ నెల నుంచి రూ.1000 చొప్పున వేతనాలు పెరుగుతాయి. ప్రస్తుతం రూ.8,500 ఉండగా ఇకపై రూ.9,500 చొప్పున ప్రతినెలా వేతనాలు అందుతాయి. పారిశుధ్య సిబ్బంది సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాలను పెంచారు.
– కృష్ణ, డీపీవో, నాగర్‌కర్నూల్