గద్వాల, ఆగస్టు 18 : రుణమాఫీ విషయంలో ప్రభు త్వం చెప్పింది ఒకటి ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. దీంతో రుణమాఫీ అయిన రైతులు సంతోషంగా ఉండగా మాఫీ వర్తించని రైతులు ఆందోళన చెందుతూ బ్యాంకు లు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు వ్యవసాయశాఖ అధికారులు కానీ, అటు బ్యాంకర్స్ కానీ రుణమాఫీ వర్తించని వారికి సరైన సమాధానం చెప్పలేక తప్పించుకుంటుండడంతో అర్హులు ఆం దోళన చెందుతున్నారు.
మరికొందరు ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వివిధ కారణాలు చూపుతూ అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వారు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. తమకు రుణమాఫీ జరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. రు ణమాఫీ కాని రైతులు సుమారు 1,100కు పైగా వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రంలో ఇప్పటికే ఫిర్యాదులు చేశారు.
జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో రైతులు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అధికారుల అంచనా ప్రకారం 95, 199 మంది రైతులు రూ.501.72 కోట్ల రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన మూడు విడుతల రుణమాఫీలో జిల్లాలో ఇప్పటి వరకు 51,188మంది రైతులకు రూ.440.73 కోట్లు రుణమాఫీ చేసింది. ఇంకా జిల్లాలో రుణమాఫీ కావాల్సిన రైతులు 44,011మంది ఉన్నారు. వీరందరూ బ్యాంకులు, వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి ఎందుకు రుణమాఫీ కాలేదని అడిగితే కొం దరికి రేషన్‌కార్డు లేదని, మరికొందరికి బ్యాంకు ఖాతాలు సరిగా లేవని, ఆధార్‌లోని పేరు బ్యాంక్ ఖాతాలోని పేరు సరిపోవడం లేదని, ఇంటిలో ఉద్యోగస్తులు ఉన్నారని వివిధ కారణాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని నిబంధనలు ఇప్పుడెందుకని రైతులు అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం రావడంలేదు. దీంతో చాలా మంది రైతులు రుణమాఫీకి అనర్హులుగా మారినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జరిగిన రుణమాఫీ పీఎం కిసాన్ ఆధారంగా చేసినట్లు రైతులు అభిప్రాయపడుతున్నా రు. రుణమాఫీకి సంబంధించి మొదటి నుంచి రై తులకు సరైనా సమాధానాలు చెప్పకుండా అధికారులు గోప్యంగా ఉండడం అనుమానాలకు తావిస్తుందనే విమర్శలు వినపడుతున్నాయి. రుణమాఫీపై అధికారులను నిలదీస్తే పైనుంచి వచ్చిన జాబితా ఆధారంగా చేశామని చెబుతున్నారు. ఏదేమైనా జిల్లాలో రుణమాఫీ అంతా గందరగోళంగా మారడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
గతంలో మా అమ్మ పేరుపై వ్యవసాయ భూమి ఉండేది. అప్పుడు మూసాపేట ఏపీజీవీబీలో అప్పు తీసుకున్నాం. మా అమ్మ మృతి చెందడంతో భూమి ని అన్నదమ్ములిద్దరి పేర్లపైకి మార్చుకున్నాం. అమ్మ పేరుపై ఉన్న అప్పును క్లియర్‌చేసి రెండేండ్ల కిందట నేను కొత్తగా రూ.43 వేలు రుణం తీసుకున్నాను. మొదటి విడుతలోనే మాఫీ కావాల్సి ఉండగా.. కాలేదు. వ్యవసాయాధికారులు, బ్యాంకోళ్లను అడిగా. రెండో విడుతలో వస్తుందన్నారు కానీ రాలేదు. మూడో విడుత కూడా అయిపాయె.
ఇప్పటికీ మాఫీ కాలేదు. అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు. ఇంక ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం లేదు. నాకు రుణమాఫీ చేసి న్యాయం చేయాలి.
– శేఖర్, రైతు, నిజాలాపూర్, మూసాపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
నేను, నా భార్య కలిసి గద్వాల యూనియన్ బ్యాంక్‌లో రూ. 1.60 లక్షలు, పీఏసీసీఎస్‌లో రూ.1.03 లక్షల రుణం తీసుకున్నాం. కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రూ.2 లక్షల మాఫీలో మాకు లబ్ధి చేకూరలేదు. మేము తీసుకున్న రుణం రూ.2 లక్షల లోపు ఉన్నా మాఫీ కాలేదు. ఈ విషయంపై బ్యాంకర్లు, వ్యవసాయశా ఖ అధికారులను అడిగితే సరైన స మాధానం చెప్పడం లేదు. ఇంకా పై నుంచి జాబితా రాలేదని చెబుతున్నారు. నేను ఏ రకంగా అర్హుడిని కాదో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
– జగన్మోహన్రెడ్డి, చెనుగోనిపల్లి, గద్వాల మండలం
ఎన్నికల సమయంలో బ్యాంకులో రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్డంకులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కొ ర్రీలు పెడుతున్నది. ఎస్బీఐలో నా పేరిట రూ.1.50 లక్షలు, భార్య రమాదేవి పేరిట రూ.1.50 లక్షల రుణం తీసుకున్నా. ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో మా పేరు లేదు. బ్యాంకర్లు సరైన సమాధానం చె ప్పడం లేదు. రూ.2 లక్షల వరకు మా ఫీ చేస్తే మిగతా డబ్బులు చెల్లిస్తానని చెప్పినా పట్టించుకోవడం లేదు. మొదట ఎక్కువ తీసుకున్న డబ్బు లు చెల్లించాలని ఆ తర్వాత ఆలోచిద్దామని అంటున్నారు. కాంగ్రె స్ చెప్పేదొకటి చేసేదొకటి.
– తిమ్మన్న, రైతు, మేలచెర్వు, గద్వాల మండలం
కాంగ్రెస్ ప్రకటించిన రుణమాఫీ గందరగోళంగా ఉంది. స్పష్టత లేక ఇబ్బందులు పడుతున్నాం. బ్యాంకుల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నాం. నేను గోపాల్పేట ఏపీజీవీబీలో రూ.లక్షకు పై గా రుణం తీసుకున్నాను. అసలు, వడ్డీ కలిపి రూ.1.50 ల క్షలు దాటింది. అదే బ్యాంకులో నా భా ర్య పద్మ పేరిట కూడా రూ.80 వేల రుణం తీసుకున్నాం. రుణమాఫీలో మా పేర్లు తెలుసుకునేందుకు వెళ్తే సంబంధిత అధికారులు టెక్నికల్ స మస్యలు ఉన్నాయని చెబుతూ కా లయాపన చేస్తున్నారు. చాలా మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
నాకు మూడెకరాల 33 గుంటల భూమి ఉంది. పాన్‌గల్ సింగిల్‌విండో కార్యాలయంలో రూ.1.80 లక్షల రుణం తీసుకున్నా ను. ప్రభుత్వం రుణమాఫీకి మూడు విడుతలు ప్రకటించినా నా పేరు రాలేదు. బ్యాంక్, వ్యవసాయ అధికారుల చుట్టూ తి రుగుతున్నా పట్టించుకోవడం లేదు. అ ధికారుల నిర్లక్ష్యం వల్లే నాకు రుణమా ఫీ కాలేదు. ఏం చేయాలో అర్థం కా వడం లేదు. ప్రభుత్వం చెప్పేదొక టి.. చేసేది మరొకటి.. రుణమాఫీపై ఆశలు సన్నగిల్లాయి. డబ్బులు మాఫీ అయితే అప్పులు తొలిగి పోతాయనుకుంటే చివరికి నిరాశే మిగిలింది.
నాకున్న మూడు ఎకరాలపై రూ.1.61 లక్షల లోన్ ఉన్నది. రుణమాఫీలో నా పేరు రాలేదు. వ్యవసాయ, బ్యాంక్ అధికారులను అడిగితే బ్యాంక్ అకౌంట్ పేరుకు ఇంటి పేరు ఉందని, ఆధార్‌కార్డులో ఇంటి పేరు లేదని.. అందుకే మ్యాచ్ కాలేదని చెబుతున్నారు. ఈ అకౌంట్ ద్వారా పదేండ్ల నుంచి లావాదేవీలు నడుస్తూ నే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఇ దే అకౌంట్‌పై క్రాప్‌లోన్ మాఫీ కాగా.. మళ్లీ ఇచ్చారు. నాలాగానే ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రభు త్వం కపట ప్రేమ చూపిస్తున్నది. కేసీఆర్ సర్కారే బాగుండే అని ఇప్పుడనిపిస్తుంది.
వీపనగండ్ల ఐవోబీలో మూడు ఎకరాలపై రూ.99వేల క్రాప్‌లోన్ తీసుకున్నాను. మొదటి విడుతలో రుణమాఫీ అయ్యింది. కానీ, ఇప్పటివరకు రెన్యూవల్ చేసి లోన్ ఇవ్వడం లేదు. బ్యాంక్, వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తే ఒకరిమీద ఒకరు చెప్పుకొంటున్నారు. పేరుకే రుణమాఫీ గానీ.. రైతులకు ఆనందమే లేదు. మాఫీ చేశామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం సాధ్యం చేయడం లేదు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్య తీర్చాలి. కేసీఆ ర్ ప్రభుత్వంలో మాఫీ అయిన వెంటనే లోన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.