కల్వకుర్తి, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో గందరగోళం నింపింది. రైతులకు రూ.2లక్షల రుణాలను మూడు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మొదటి విడుతగా రూ.లక్ష వరకు రుణాలను ఈనెల 18న మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకనుగుణంగా ప్రభు త్వం 17 సాయంత్రం వరకే జిల్లాల వారీగా రూ. లక్ష రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితా ప్రకటించింది. 18న రుణమాఫీ చేశామని ముఖ్యమం త్రి స్థాయి నుంచి గల్లీ లీడర్ వరకు సంబురాలు చే సుకున్నారు. ఒక వైపు కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకొంటుంటే.. సంబురాల్లో పాల్గొనాల్సిన రైతులు మాత్రం రుణమాఫీ జాబితాలో పేర్ల కోసం బూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు.
కల్వకుర్తి పీఏసీసీఎస్‌లో 1407మంది రైతులు పంట రుణాలు పొందారు. అందులో 977 మంది మంది రైతులకు రూ.లక్షలోపు, 293 మంది రైతులకు రూ.1.50లక్షలలోపు, 137 మంది రైతులకు రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీలో 977 మంది రైతులకు సంబంధించి రూ.4,29, 14, 960కి గానూ కేవలం 192 మంది రైతులకు సంబంధించి రూ.95,90,704 మాఫీ అయినట్లు జాబితాలో వచ్చింది. అంటే 785 మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ రాలేదన్న మాటే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొన్నది.
రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో ఒకటైతే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం అందుకు భి న్నంగా మాట్లాడుతున్నారు. రుణగ్రహీతలైన అ ర్హుల ఎంపికకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఉంటే, ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం రైతులను గు ర్తించడానికే రేషన్‌కార్డు అని చెబుతున్నారు. పట్టాదార్ పాసు పుస్తకం ఉండి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ రైతులే. ఇందుకు రేషన్‌కార్డు నిబంధన ఎం దుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐటీ చెల్లించే వారి విషయంలో కూడా మంత్రులు తలోవిధంగా చెబుతున్నారు. ఎవరెన్ని ఏవిధంగా చెప్పినా.. ప్ర స్తుతం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితా మా త్రం ఇచ్చిన జీవో ప్రకారమే ఉందని, అందుకే 25 శాతం రైతులు కూడా రుణమాఫీకి అర్హత సా ధించలేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది. రైతులు తీసుకున్న రుణాల అసలు వరకే మాఫీ చేస్తారా.. వడ్డీ కూడా చేస్తారా అన్న ప్రశ్నలు రైతుల నుంచి తలెత్తుతున్నాయి. ఉదాహరణకు జంగయ్య అనే రైతు ఒక బ్యాంక్‌లో 2021లో రూ.60వేలు పంట రుణం తీసుకున్నా డు. 2023 డిసెంబర్ వరకు అసలు మిత్తి కలి పి రూ.75వేలు అయ్యిందనుకుంటే, ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కే వలం అసలు మాత్రమే మాఫీ చేస్తుందా.. అసలు, మిత్తి కలిపి చేస్తుందా అనే సందేహాలు రైతుల నుం చి వ్యక్తమవుతున్నాయి. కొంత మంది బ్యాంకర్లు మిత్తి కడితేనే అసలు మాఫీ అవుతుందని చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.