కొల్లాపూర్ రూరల్, జనవరి 9: ప్రజాపాలన ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.15వేలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే బీరం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని డింమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేడు రూ.12వేలు ఇస్తామనడం సమంజసం కాదని దుయ్యబట్టారు.
అనాడు ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు కేసీఆర్ ఇస్తే రైతులకు బిచ్చం మేస్తున్నావా మేము వస్తే రూ.15వేలు ఇస్తామని చెప్పాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. ఇంతవరకు రూపాయి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇప్పటికే మూడు విడుతల డబ్బులు ఎగ్గొట్టారని విమర్శించారు. నేడు ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.12 వేలు ఇస్తామని యావత్ తెలంగాణ రైతులను మోసం చేసిందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేదిలేదని.. తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేసులో అక్రమ కేసు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తుందని.. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తుందన్నారు. రాబోయే రోజల్లో ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి మీడియాలో చూపిస్తూ కుట్ర చేస్తునారని ఎద్దేవా చేశారు. కచ్చితంగా మేము రైతుల పక్షాన నిలబడుతాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రైతుభరోసా కింద రూ.15వేలు ఇచ్చే వరకు పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాగనూరులో బీఆర్ఎస్ నేతల ధర్నా
మాగనూర్, జనవరి 9 : రైతు భరోసా సాయంపై ప్రభుత్వం కొర్రీలు పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గురువారం మాగనూరు తాసీల్దార్ కార్యాలయం ఎదుట గంటపాటు ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి మాగనూరుతోపాటు కృష్ణ మండలాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం రేవంత్ రైతులకిచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే.. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారే చేసినట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనవే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ చేస్తామని అరకొరగా చేసి చేతు లు దులుపుకొన్నట్లు విమర్శించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ గరీమనరుల, ఇన్చార్జి తాసీల్దార్ సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.