రైతుల పరిస్థితి ఎక్కడికి వెళ్లినా ‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’ అన్న చందంగా తయారైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తరుగు పేరుతో క్వింటాలకు రెండున్నర కేజీలు దండుకుంటున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహారం తయారైంది.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనేందుకు.. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభు త్వం కేంద్రాలను ఏర్పాటు చేసింది. సెంటర్ల నిర్వాహకులకు మాత్రం కాసులు కురిపిస్తున్నాయి. రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నది. దీంతో పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా రైతులు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడున్న నిర్వాహకులు మాత్రం తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దేశానికి వెన్నెముక రైతు అని భావిస్తూనే కొనుగోలు సెంటర్లలో నిర్వాహకులు రైతుల నడ్డి విరుస్తూ నిండా ముంచుతున్నారు. అధికారులు అన్నీ తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతులు ఇబ్బందులు పడ్తున్నా.. తమ దృష్టికి రాలేదని తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఒకవేళ ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని చెబుతూ చేతులు దులుపుకొంటున్నారు.
40 కేజీల బస్తాకు కేజీ దండుకొంటూ..
కొనుగోలు సెంటర్‌కు రైతులు తీసుకొచ్చిన ధాన్యం 14 నుంచి 17 శాతం తేమ ఉంటే తరుగు తీయకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరుతో రైతులను నట్టేట ముంచుతున్నారు. ధాన్యం ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ధాన్యం మంచిగా ఉన్నా.. అదనంగా 40 కేజీల బస్తాపై కేజీ తూకం తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల బస్తాను నింపి ధాన్యం తూకం వేస్తారు.. బరువు 580 గ్రాములు ఉంటుంది. నిబంధనల ప్రకారం 40.580 గ్రాముల తూకం వేయాల్సి ఉన్నది. అయితే ప్రతి 40 కేజీల బస్తాకు 41.600 గ్రాముల తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఇలా బస్తాకు కేజీ అదనంగా తీయడంతో క్వింటాకు రెండున్నర కేజీలు అదనంగా ధాన్యం తూకం వేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
ఎక్కువ తూకం వేసి.. బినామీ పేర్లపై నమోదు
కొనుగోలు సెంటర్లలో ఎక్కువ తూకం వేసిన ధాన్యం రికార్డుల్లో తమకు అనుకూలమైనా రైతుల పేరున నమోదు చేసి వాటిని కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీనిపై వచ్చే బోనస్‌ను సెంటర్ల నిర్వాహకులు పంచుకుంటున్నారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంటర్ల నిర్వాహకులు కొందరితో కుమ్మకై ఇలా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సెంటర్లలో ఇంత జరుగుతున్నా తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దీంతో నిర్వాహకులు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడవమే కారణంగా తెలుస్తోంది. మహిళా సంఘాలకు కేటాయించిన సెంటర్లు పేరుకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఉంది కానీ.. వాస్తవంగా ఆ సెంటర్లను లీడర్లే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఎక్కువ తూకం ఎందుకు వేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తే.. మీ ధాన్యంలో తేమ ఎక్కువగా ఉన్నదని, ఇంకా ఆరబెట్టాలని నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు క్వింటాలుకు హమాలీ పేరుతో రూ.50 నుంచి రూ.60 రైతుల నుంచి వసూలు చేయడంతో రైతులు ఎటు చూసినా నష్టపోతున్నారు. పేరుకు మాత్రమే కొనుగోలు సెంటర్లు కానీ కేంద్రాల్లో రైతులు అడుగడునా దగాకు గురవుతున్నారు. కలెక్టర్ కలుగ జేసుకొని సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 81 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ధాన్యం కొం టున్నారు. వాస్తవంగా వానకాలం సీజన్లో 2.62 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. బ స్తాకు 41 కేజీలు తీసుకున్నట్లు రైతులు అ ధికారుల దృష్టికి తీసుకెళ్తే ధాన్యం తరలి ంపు విషయంలో కొంత అక్కడక్కడ కింద చల్లుతుంటారు. అందులో భా గంగా అర కేజీ ధాన్యం తీసుకుంటున్నారని అధికారులు చావు కబురు చ ల్లగా రైతులకు చె బుతున్నారు.