నాగర్‌కర్నూల్, మార్చి 22 : పేరుకే జిల్లా కేంద్రం.. రాత్రి 9 దాటితే బస్సులు కరువు.. హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్‌కు రాత్రివేళల్లో చేసే ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ సమయంలో సర్వీసులు తక్కువగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర రాజధానికి వెళ్లిన ప్రయాణికులకు బస్సు కోసం పడిగాపులు తప్పడం లేదు. నిత్యం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతోపాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, బిజినేపల్లి మండలాల నుంచి ప్ర యాణికులు వందలాదిగా హైదరాబాద్, ఇతర ప్రాం తాలకు వెళ్లి వస్తుంటారు. గతంతో ఎంజీబీఎస్ బస్టా ండ్ నుంచి రాత్రివేళల్లో బస్సులు బాగా తిరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు.
ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో బస్సుల సంఖ్యను పూర్తిగా తగ్గించారని అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ డి పో బస్సులంటేనే సమయానికి రావని, వచ్చి నా వరుసగా వెంటవెంటనే వెళ్తుంటాయని పలువురు ఆరోపిస్తున్నారు. అదే ఉదయం సమయంలో ఫుల్‌గా ఉండే బస్సులు.. రాత్రి అయితే జాడ లేకుండా పోతున్నాయని పేర్కొంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ పెరిగిన నేపథ్యంలో అదనంగా బస్సులు నడిపించాల్సిన అధికారులు వాటి సంఖ్యను తగ్గిస్తే ఎలా అని ప్రయాణికులు నిలదీస్తున్నారు.
ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో షాపింగ్.. ఇతర పనుల నిమిత్తం రాత్రి సమయంలో ఆలస్యంగా వచ్చే తాము 11 గంటల తర్వాత హైదరాబాద్‌లో బయలుదేరే చివరి కొల్లాపూర్ బస్సు కోసం రెండు గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందని పలువురు ముస్లింలు వాపోతున్నారు. కొన్ని సార్లు బస్సుల్లేక వనపర్తి డిపో బస్సులను ఆశ్రయించి బిజినేపల్లి వరకు వచ్చినా.. అక్కడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని నాగర్‌కర్నూల్‌కు వెళ్లేందుకు.. కొన్ని సార్లు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని.. కొందరు రాత్రిళ్లు ఆపడం లేదని.. దీంతో దోమల బెడద మధ్య గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.
దీంతో 3 గంటల ప్రయాణం కాస్తా సాగుతూ ఐదారు గంటల వరకు కొనసాగుతుండడంతో ప్రయాణికులు బేజారెత్తిపోతున్నారు. రాత్రి వేళల్లో బస్సుల రాకపోకల గురించి పలుమార్లు ఆర్టీసీ డిపో అధికారులకు విన్నవించినా ఒకటి రెండ్రోజులు నడిపి.. తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా నాగర్‌కర్నూల్ డిపో అధికారులు స్పందిం చి రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి బస్సులను నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.